Home రాష్ట్రీయ వార్తలు ‘క్రోధి’ వచ్చింది..కోపం తగ్గించుకోండి!

‘క్రోధి’ వచ్చింది..కోపం తగ్గించుకోండి!

The boy with his eyes closed covers his ears with his hands so that no one can hear . Pain in the ears and head . Vector illustration.

ఉగాది పండుగ కూడా వచ్చేసింది. ఈనెల 9న ఉగాది పర్వదినం రోజున రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉగాది వేడుకలు పర్వాలేదు..బాగానే జరిగాయి. ప్రజలు కొత్త తెలుగు సంవత్సరారంభాన్ని ఘనంగానే స్వాగతించారు. ఒకవైపు ఎండల దాడి.. మరోవైపు ఎన్నికల వేడిలో..ఈసారి ఈ వేడుకల్లో అనుకున్నంత ఉత్సాహం కనిపించలేదు. దేవాలయాలకు వెళ్ళిడం, ఈ ఏడాదంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడు స్వామీ..అంటూ మొక్కుకోవడం అన్నీ షరా మామూలుగానే జరిగిపోయాయి. ఇళ్ళలో ఉగాది పచ్చళ్ళు చేసుకున్నారు కానీ, చాలాచోట్ల వేపపూత, మామిడిపిందెలు దొరక్క ఇబ్బందులు పడ్డారు. గతంలో ఇవన్నీ అందరికీ ఉచితంగానే లభించాయి కానీ, ఇప్పుడా ఉచితాలు మాత్రం అలభ్యం. పక్కింటికి వెళ్ళి నాలుగు మామిడాకులు కోసుకోవడం, వీధిలో వేపచెట్టెక్కి వేపపూత తెచ్చుకోవడం ఈ కాలంలో చాలామందికి నామోషీ అయిపోయింది. అంగట్లో దొరుకుతాయి కదా అని, డబ్బులు పెట్టి కొనుక్కోవడం ఫ్యాషనైపోయింది. ఇక పట్టణాలు, నగరాల్లో కవులకు ఇది పెద్దపండుగ లాంటిది కనుక, అనేకసంస్థల వారు ఉగాది ఎప్పుడొస్తుందా అని కాసుకుని ఉంటారు. కవుల సంగతి ఇక చెప్పనే అక్కరలేదు. కవి సమ్మేళనాలు ఎక్కడ జరుగుతాయా?..ఎవరు సన్మానాలు చేస్తారా అని ఎదురుచూస్తుంటారు. రాజకీయ నాయకులు ప్రచారాల్లో తలమునకలై ఉన్నట్లే, ఇళ్ళల్లో పిలకాయలు తమ ఆటపాటల్లో మునిగి తేలుతుంటారు.
షడ్రుచుల సమ్మేళనం.. ఉగాది
‘ఉగాది’ అంటే యుగానికి ఆది… అని శాస్త్రవచనం. పూర్వకాలంలో ‘సోమకాసురుడు’ అనే రాక్షసుడు వేదాలను అపహరించి సముద్రగర్భంలో దాక్కున్నాడని, విష్ణుమూర్తి మత్సా ్యవతారంతో వెళ్ళి సోమకుడిని వధించి, ఆ వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించాడని, దాంతో బ్రహ్మ తిరిగి సృష్టికి శ్రీకారం చుట్టడంతో ఆ రోజును ‘యుగాది’గా పిలుస్తారని పురాణాలు చెప్తున్నాయి. సృష్ఠి ప్రారంభమైన రోజు కనుక అది యుగాది..అదే ఉగాది అయింది. ప్రతిఏటా చైత్రమాసం, శుక్లపక్ష పాడ్యమి రోజున ఉగాది వస్తుంది. అందుకే ఉగాదిని ఒక పండుగగా చేసుకోవడం మన ఆనవాయితీ. అంతేకాదు, ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం అని, మానవ జీవితానికిదో ప్రతీక అనీ అంటారు. మానవ జీవితమే ఆరు రుతువుల సమ్మేళనమని, ఆరు రుచుల కలబోత అనీ, కొత్త ఆశలే వసంతమని, భవిష్యత్తు కూడా నవవసంతంలా వెల్లి విరియాలని ఆకాంక్షిస్తూ పండుగ చేసుకోవడం తెలుగువారికి కొత్తేమీ కాదు. ఏడాదంతా హాయిగా ఉండాలని, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమంగా చేసుకుని ముందుకు పయనించాలని నిశ్చయించుకుంటారు. షడ్రుచుల సమ్మేళనంతోనే ఉగాది పచ్చడి కూడా చేసుకుంటారు. వేపపూలు, మామిడికాయ, కొత్తబెల్లం, కొత్త చింతపండు, చెరకుముక్కలు, అరటి పండు, చిటికెడు ఉప్పు, కాస్తంత నెయ్యి కలిపి మధురాతి మధురంగా
ఉగాది పచ్చడి చేసుకునేవారు. అయితే, ఇప్పుడలాంటివి పట్టణాలు, నగరాల్లో పెద్దగా కనిపించడం లేదు. పాతకాలం నాటి సంప్రదాయ పద్ధతులతో పండుగలు చేసుకోవడమన్నది ఇప్పుడు దాదాపు కనుమరుగైపోతుండడం బాధాకరం. ఎంతో ఇష్టంగా తినే అప్పచ్చులు కూడా ఇళ్ళల్లో చేసుకునేవారు కరువైపోతున్నారు. అన్నీ అంగళ్లలో కొనుక్కొని సంబరపడిపోతున్నారు. ఫోన్లమీద, టీవీల మీద ఉన్న శ్రద్ధ జీవితాలకు శుభం కలిగించే పండుగల మీద, నాటి ఆచారాలు..సంప్రదాయాల మీద లేకుండా పోతోందని ఎవరైనా అంటే…వారిని గుర్రుగా చూస్తున్నారు.
కోపంతో సాధించేదేమీ ఉండదు
ఈ ఉగాది పేరు..క్రోధి. ‘క్రోధి’ నామ ఉగాది కాబట్టి..క్రోధంగానే ఉం టుందని, కాబట్టి ప్రజలు కోపం తగ్గించుకుని సంయమనం పాటించి కుటుంబాల్లో కలతలు రాకుండా చూసుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ ఏడాది కోపతాపాలతో పచ్చని సంసారాల్లో వేదనలు మొదలవుతాయని, గ్రహాల స్థితిగతులు పెద్దగా బాగా లేవు కనుక శుభాలను కూడా పెద్దగా ఆశించలేమంటున్నారు జ్యోతిష్కులు. దేశాల మధ్య యుద్ధాలు, వైరుధ్యాలు బాగా పెరుగుతాయని, మనదేశంలో వర్షాలు సరిగా కురవవని, రాష్ట్రంలో లేనిపోని అలజడులు, అశాంతి వాతావరణం ఉంటుందని, రాజ కీయాల్లో ఆటుపోట్లు తప్పవని చెప్తున్నారు. క్రోధి..వాతావరణం, గ్రహబలాలు, దైవానుకూలాలను లెక్కవేసి పండితులు పంచాంగ శ్రవణాల్లో ఇలాంటివన్నీ చెప్పారు. దైవానుగ్రహంతో కొన్ని మేళ్ళు కూడా జరుగుతాయన్నారు. అయితే, అన్నీ అచ్చుగుద్దినట్లు అలాగే జరుగుతాయా అన్నది చెప్పలేం కానీ, ముందస్తు జాగ్రతగా ఆవేశకావేషాలు తగ్గించుకోవడంలో తప్పులేదు.
నిదానం ప్రదాన మనీ, తన కోపమె తన శత్రువు..తన శాంతమె తనకు రక్ష అని పద్యకారులు ఊరకే అనలేదు. అన్నీ అనుభవించి చెప్పే మాటలే అవి. ఏదేమైనా కోపం తగ్గించుకోవాలన్నదే సూచన. సహనం, సంయమనం వల్ల ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. క్రోథం వల్ల కష్టాలు పెరుగుతాయే తప్ప తరిగేదేమీ ఉండదు. చీటికీమాటికీ కోపపడి చివరికి సాధించేదేమీ ఉండదు. కాబట్టి.. ఒకరని కాదు.. అందరూ.. అన్ని రంగాల్లోని వారూ కోపం తగ్గించుకుని, విజ్ఞతతో వివేకంతో వ్యవహరిస్తే, అదే మనల్ని మంచిదారిలో నడిపిస్తుందనేది సారాంశం!..
` రాజశ్రీ

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here