Home జాతీయ వార్తలు వీళ్ళు.. వాళ్ళవుతున్నారా?

వీళ్ళు.. వాళ్ళవుతున్నారా?

నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు `
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే…
శ్రీశ్రీ చెప్పిన ఈ మాటలు నూటికి నూరు శాతం నిజం. ఒకరు పైకి ఎదిగి నంత కాలం నిబిడాశ్చర్యంతో ప్రపంచం చూస్తూనే ఉంటుంది. పొరపాట్ల కార ణంగా నేలకు రాలుతున్నప్పుడు ఆశ్చర్యం స్థానంలో, నిర్దాక్షిణ్యం మొదలౌతుంది. ఈ సమాజం కనీసం జాలి కూడా పడదు. ప్రజాస్వామ్యంలో ఈ ధోరణి మరింత ఎక్కువ. నమ్మకం ఎంతగా చూపుతుందో సమాధానం కూడా అంతే స్థాయిలో చెప్తుంది. ఈ విషయాన్ని గతంలో కాంగ్రెస్‌ పార్టీ విస్మరించింది. అందుకు పదేళ్ళుగా ఫలితం అనుభవిస్తూనే ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం అప్పట్లో తామే అన్నీ అన్న నమ్మకాన్ని ప్రజల్లో కలి గించినప్పటికీ, మళ్లీ పాత తప్పిదాలతోనే పాకుడు రాళ్ళ మీద నడుస్తోంది. మేలు కుని తప్పులు దిద్దుకుంటే పర్వాలేదు కానీ తప్పు ఏదీ లేదు`తప్పేదీ లేదు అనుకుంటే మాత్రం కాంగ్రెస్‌ పాఠాలు, మళ్ళీ బీజేపీ చదవాల్సి వస్తుంది. నాలుగు రోజులు సహవాసం చేస్తే వారు వీరౌతారన్నది జగమెరిగిన పాత సామెత. అయితే నాలుగు రోజులు సమరం చేసినా వారు వీరౌతారన్నది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేర్పుతున్న కొత్త సామెత. గతంలో కాంగ్రెస్‌ పార్టీ చేసిన తప్పులనే, బీజేపీ మళ్ళీ మళ్లీ చేస్తోంది. అందరూ భారతీయ జనతాపార్టీ విజయాలను చూస్తున్నారే తప్ప ప్రతి విజయం వెనుక కుప్పలుగా పేరుకు పోతున్న తప్పులను మాత్రం గమనించడం లేదు. అవి కనిపించవు కూడా. ఏనుగు మీద ఊరేగుతున్న వాడికి కింద ముళ్ళు కనపడవు. దిగాల్సిన సమయం వచ్చిన ప్పుడు మాత్రమే… ఈ దారిలో ఎందుకు వచ్చానా అనే పశ్చాత్తాపం మొదలౌతుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
పడి లేస్తున్న కాంగ్రెస్‌!
ఎన్టీయే కూటమి ద్వారా భారతీయ జనతాపార్టీ ఎన్నికల బరిలో నిలుస్తున్న తొలినాళ్ళలో ‘‘అదో అతుకుల బొంత’’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ బీరాలు పలికింది. అందులో ఎవరూ చేరరు అంటూ జబ్బలు చరుచుకుని చెప్పుకుంది. అయితే కాంగ్రెస్‌ పార్టీది మేకపోతు గాంభీర్యం అని తెలియ టానికి ఎన్నో రోజులు పట్టలేదు. అనతి కాలంలోనే యూపీఏ పేరిట వారు కూడా ఓ బొంత కుట్టుకోక తప్పలేదు. కొన్ని దశా బ్ధాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు కేవలం ఒక రాజకీయ పార్టీగా చూడరన్నది నిర్వివాదాంశం. స్వరాజ్య ఉద్యమం మొదలుకుని ప్రజల జీవితాల్లో కాంగ్రెస్‌ ఓ భాగం. తిట్టుకో వాలన్నా సరే కాంగ్రెస్‌ పార్టీకి మించిన ప్రత్యామ్నాయం లేదు. అంతగా ప్రజల జీవితాలతో ఆ పార్టీ పెనవేసుకుపోయింది. బహుశా అందుకే కాబోలు కాంగ్రెస్‌ పార్టీలో మార్పు వచ్చిందనుకున్న ప్రతిసారీ ప్రజలు వారినే గెలిపిం చారు. మార్పు రాలేదనుకున్న తర్వాత వారినే మార్చే శారు. ఇలా కాంగ్రెస్‌పార్టీ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ప్రత్యామ్నాయంగా ప్రజల అభిమా నాన్ని చూరగొంటూనే ఉంది. మళ్లీ చతికిలబడు తూనే ఉంది.
హిందుత్వ నినాదంతో
గద్దెనెక్కిన బీజేపీ..!
ఇదే క్రమంలో….. ‘‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’’ అన్న నినాదంతో భారతీయ జనతా పార్టీలోని యువరక్తం సరికొత్త భారతాన్ని నిర్మిస్తాం అంటూ ముందుకు వచ్చింది. అప్పటికే కాంగ్రెస్‌ పార్టీ వల్ల మరోసారి విసిగి వేసారిన ప్రజలు ఎన్టీయే వైపు మళ్ళీ చూడటం మొదలు పెట్టారు. సరిగ్గా అదే సమయంలో మత తత్వ పార్టీ అనే ముద్రను బీజేపీ మీద వెయ్యాలని చూసిన కాంగ్రెస్‌ పార్టీ చతికిలబడక తప్పలేదు. ఆ ముద్ర అద్వానీ విషయంలో బలహీనతగా పనికొచ్చిం దేమో గానీ , మోడీ విషయంలో మాత్రం బలంగా బాటలు వేసింది. హిందూ మతానికి బీజేపీ తప్ప, మరో దిక్కు లేదు అనేంతగా బీజేపీని ప్రజల్లోకి తీసుకు వెళ్ళడంలో కాంగ్రెస్‌పార్టీ పెద్ద విజయమే సాధించింది. ఫలితంగా పదేళ్ళ పాలన తర్వాత బీజేపీకి అధికారాన్ని అప్పగించి మన్మోహన్‌ సర్కార్‌ నిష్క్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం కాంగ్రెస్‌ అనాలోచిత విధానాలే. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలే. ఇదే అదనుగా బీజేపీ బలపడేందుకు ప్రయత్నించింది. కొత్త రక్తాన్ని బలంగా చూపించింది. తాము వస్తే రాజకీయాల్లోనే కాదు, అన్ని రంగాల్లో మార్పు సుస్ప ష్టంగా చూపిస్తామని స్పష్టంగా చెప్పింది. ఫలితంగా 2014 లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
మోడీయే పార్టీ…
పార్టీ అంటే మోడీయే అన్నట్లుగా!
అలా పదేళ్ళు గడిచాయి. ఈ క్రమంలో మోడీ జోలికి వెళ్ళటానికి ఎన్నో పార్టీల నుంచి ఎంతో మంది నేతలు ప్రయత్నించారు. అయితే రామాయణంలో వాలిలాగా మోడీ ఎప్పటికప్పుడు బలపడుతూనే వచ్చారు. ఎవరైనా నేరుగా వాలితో యుద్ధానికి దిగితే… వారి బలమంతా గుంజేసుకునే వరం వాలికి ఉంది. సరిగ్గా మోడీది కూడా అలాంటి పరిస్థితే. ఛాయ్‌ వాలా అనే మాటను మోదీ బలంగా వినియో గించుకున్నారు. చౌకీదార్‌ అనే మాటను అంతకంటే బలంగా ఉపయోగించుకున్నారు. ఇటీవల ‘పరివార్‌ లేని వాడు’ అనే నిందను కూడా సానుకూలంగా మలచుకోవటం బహుశా మోదీకి మాత్రమే చెల్లింది. ఇలాంటి పరిస్థితుల్లో మోదీని కాంగ్రెస్‌ ఢీకొనగలదా అనే సందేహాలు రాకమానవు. ఎందుకంటే మోదీ ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదుగుతున్నారన్నది నిర్వివాదాంశం. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గుర్తింపును పెంచుతున్నారన్నది ఒప్పుకుని తీరాల్సిన వాస్తవం. అయితే ఇవన్నీ తెలిసిన జనాలు తక్కువ శాతమే. ఇలాంటి వాటి వల్ల పడే ఓట్ల శాతం కూడా తక్కువేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కాంగ్రెస్‌ తప్పులే
బీజేపీకి కలిసొచ్చాయి?
ఒకప్పుడు కాంగ్రెస్‌ సరిగ్గా ఇలాంటి తప్పిదమే చేసింది. కేంద్రంలో ఉన్న అధికారాన్ని చూసుకుందే తప్ప… క్షేత్ర స్థాయిలో బలపడుతున్న బీజేపీని మాత్రం విస్మరించింది. అందుకు తగిన మూల్యం భారీగా చెల్లించుకోవలసి వచ్చింది. ఇది చాలదు అన్నట్లు అనేక వ్యవస్థలను తమకు అనుకూలంగా చేసుకుని పగ తీర్చుకునే ప్రయత్నాలు చేసింది. ఇలాంటి పరిస్థితులను బీజేపీ తనకు అనుకూలంగా మలచుకుని… ఈ రాళ్ళన్నింటితో మేలి రకం మెట్లు నిర్మించుకుని విజయ పథంలో ముందుకు సాగింది. ఆ సమయంలో కాంగ్రెస్‌ మాత్రం విసిరిన రాళ్ళను చూస్తుందే తప్ప… అవి తమ పునాదివి అనే సంగతిని మాత్రం విస్మరించింది. నిజానికి ఆరోజు బీజేపీ ప్రధాన బలం కాంగ్రెస్‌ అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం కాంగ్రెస్‌ కారణంగానే బీజేపీ గెలవగలిగింది. ఢల్లీిలో కేజ్రీవాల్‌ అధికారంలోకి రావటమే ఇందుకు పెద్ద నిదర్శనం. ప్రజలు బీజేపీని కాంగ్రెస్‌కు బలమైన ప్రత్యా మ్నాయంగా చూడటం వల్లనే బీజేపీ గెలవగలిగింది. ఈ విషయాన్ని బీజేపీ బయటకు చెప్పకపోయినా…. వారందరికీ తెలిసిన వాస్తవం ఇది.
కాంగ్రెస్‌ చేసిన తప్పునే
ఇప్పుడు బీజేపీ చేస్తోందా?
దాదాపు పదేళ్ళ తర్వాత కూడా బీజేపీ కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ నినాదాన్ని కొనసాగించటం, కాంగ్రెస్‌ను కుటుంబ పార్టీ అని తూలనాడుతూనే ఉండటం…. సరిగ్గా కాంగ్రెస్‌ పాత తప్పిదాలనే గుర్తు చేస్తున్నాయి. మన్మోహన్‌సింగ్‌ను పదేళ్ళు ప్రధానిగా కొనసాగించిన తర్వాత కూడా, ఆ తర్వాత పదేళ్ళు బీజేపీ అథికారాన్ని అనుభవించిన తర్వాత కూడా, అంటే దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత కూడా కాంగ్రెస్‌ గురించి చెప్పటానికి బీజేపీకి ఇంతకంటే ఇంకే కారణాలు దొరకలేదా అన్నదే అసలు ప్రశ్న. ఈ మధ్యలో రాహుల్‌ గాంధీలో మార్పు సైతం స్పష్టంగా కనిపిస్తోంది. మన్మోహన్‌ ప్రభుత్వం కొనసాగుతున్న సమయంలో రాహుల్‌గాంధీ మాటలు, నిర్ణయాలు బీజేపీకి మంచి ఆయుధాల్లాగా దొరికాయి. దీనికి కారణం అప్పుడు బీజేపీ అధికారంలో లేక పోవటం మాత్రమే. కానీ ఇప్పుడు బీజేపీ నేరుగా రాహుల్‌ గాంధీ మీద విమర్శలు గుప్పిస్తోంది. అంటే రాహుల్‌ గాంధీ ఎదిగాడన్న విషయాన్ని బీజేపీ నేరుగా ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్‌ విజయానికి ఇంత కంటే గొప్ప కారణం అవసరమా అన్నదే మరో ప్రశ్న.
బీజేపీ చేస్తున్న మరో తప్పు… క్షేత్రస్థాయి పరి స్థితుల్లో మార్పు తీసుకురాలేకపోవటమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్ళ తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు తన ప్రభావాన్ని చూపలేక పోయింది. అధికారంలో లేకపోయినా ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్‌ విజయదుంధుభికి కారణం ఏమిటి? ప్రజలు పార్టీ మార్పును కోరుకుంటే గెలవ టానికి కాంగ్రెస్‌కు ఎన్ని అవకాశాలు ఉన్నాయో, బీజేపీకి సైతం అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రజలు కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపారు. అంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితి బీజేపీకి కనిపించటం లేదు. కాదు… కాదు… కనిపించనివ్వటం లేదు. ఈశాన్య భారతం వరకూ పాకిన బీజేపీ విజయపరంపర దక్షిణాదికి ఎందుకు చేరలేకపోతోంది. మోదీ, అమిత్‌ షా, నడ్డా లాంటి నాయకులు ఇక్కడ విజయాన్ని ఎందుకు ముద్దాడలేకపోతున్నారు. కాంగ్రెస్‌ మాత్రమే అలవోకగా అనేక పరాజయాల తర్వాత కూడా ఇక్కడ విజయాలను ఎందుకు అందుకోగలుగుతోంది అన్నది బీజేపీ వేసుకోవలసిన ప్రశ్న.
చరిష్మా పెంచుకుంటున్న కాంగ్రెస్‌!
భారత్‌ జోడో యాత్ర రూపంలో రాహుల్‌ గాంధీ ఇమేజ్‌తో పాటు, కాంగ్రెస్‌ ఇమేజ్‌ కూడా దేశంలో కాస్తంత పెరిగింది. ఇది ఇలానే ముందుకు సాగితే మళ్ళీ ప్రజలు కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతారనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ బీజేపీ చేస్తున్న తప్పిదం ఒక్కటే… తమ విజయాల గురించి చెప్పుకోకుండా… పదేళ్ళ పాలన తర్వాత కూడా కాంగ్రెస్‌ తప్పులనే ఎత్తి చూపుతోంది. ఇటీవల తమ విజయాల గురించి చెప్పుకోవాలని మోదీ నాయ కత్వంలోని భారత ప్రభుత్వం వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టింది. అయితే సరైన ప్రణాళిక లేకుండా మొదలైన ఈ కార్యక్రమం చాలా రాష్ట్రాల్లో మమ అనే విధంగా సాగిందే తప్ప, బీజేపీకి ఓటు బ్యాంకును పెంచేలా మాత్రం సాగలేదు. దానికితోడు గతంలో ఓడిపోవ టానికి ముందు అద్వానీ చెప్పిన ‘‘భారత్‌ వెలిగిపో తోంది’’ అనే నినాదానికి ఏ మాత్రం తీసిపోని విధంగా వికసిత్‌ భారత్‌ నినాదం ఉంది. దానికి తోడు బీజేపీ ప్రభుత్వం పేరు మోదీ ప్రభుత్వంగా మారింది. అంటే గతంలో కాంగ్రెస్‌లో బలంగా కనిపించే వ్యక్తి పూజ, విజయవంతంగా బీజేపీ జీన్స్‌లోకి బలంగా చొచ్చుకు పోయింది.
భాజపా గెలుపు
నల్లేరు మీద నడకేం కాదు!
బీజేపీ మాత్రం 400 సీట్లు సాధించే తీరతామని చెప్పటం మానలేదు. నిజంగా సాధిస్తామన్న ధీమా ఉంటే ఇన్నిమార్లు చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో బీజేపీ ఇలా చెప్పిన దాఖలాలు కూడా లేవు. కానీ ఇప్పుడు మాత్రం అదే పనిగా సీట్ల గురించి చెబు తోంది. దీనివల్ల బీజేపీ ఓటింగ్‌ మిషన్లను మేనేజ్‌ చేస్తుందన్న అపోహలకు మరింత బలం కలిగింది. నిజానికి అలాంటిదేమీ జరుగుతుందని మనం అనుకోవలసిన అవసరం లేదు. భారతదేశంలో కోర్టు లతో పాటు, ఎన్నికల సంఘం కూడా అంతే బలంగా ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. అధికా రంలో ఉన్న వారు ఎన్నికలను ప్రభావితం చేయగల పరిస్థితుల్లో ప్రస్తుతమైతే లేరన్నది నిర్వివాదాంశం. ఈ పరిస్థితుల్లో ప్రజలకు నమ్మకం కలిగించేందుకు బీజేపీ చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది.
కాంగ్రెస్‌ కూడా కష్టపడాల్సి ఉన్నప్పటికీ… ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో లేదు గనుక, తదుపరి విజయం కోసం కాంగ్రెస్‌ 50శాతం కష్టపడినా సరిపోతుంది. కానీ బీజేపీ 150శాతానికి మించి కష్టపడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో ఉన్న క్యాడర్‌ గురించి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆర్‌.ఎస్‌.ఎస్‌. రూపంలో బీజేపీకి ఓ బలమైన బలగం ఉందని అందరూ భావిస్తారు. అదే నిజం కూడా. అక్కడ నుంచి పెద్ద పెద్ద నాయకులు పుట్టుకొచ్చి బీజేపీకి అండగా నిలిచారు. వారి విషయ పరిజ్ఞానం కూడా మరింత విశేషమైందే. కానీ ఇప్పుడు బీజేపీని నమ్ముకున్న పాత నాయకులంతా ఆర్థికంగా నిలదొక్కుకోలేని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా బలంగా ఉన్న ఇతర పార్టీల నాయకులకు బీజేపీ సాదర ఆహ్వానం పలుకుతోంది. ఇది నిజానికి కాంగ్రెస్‌ పార్టీ గతంలో చేసిన తప్పిదం. ఓటమికి గల అనేక కారణాల్లో ఒకటి. అధికార పార్టీలోకి వలస వచ్చారంటే వారు కచ్చితంగా డబ్బు బలంతో పాటు, అధికార బలం కూడా కావాలని వచ్చే వారే. వీరి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసిన బాధ్యత బీజేపీ మీదే ఉంది.
ఇతర పార్టీల నుంచి వస్తున్న సీనియర్‌ నాయకు లను బీజేపీ తన బలంగా భావిస్తోంది. కానీ బీజేపీ గతంలో బలంగా వినిపించిన వయసు నిబంధనకు ఇలాంటి అంశాల వల్ల తూట్లు పడుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్‌లో కొత్త రక్తం కనిపిస్తోంది. ఇటీవల తెలంగాణలో రాజ్యసభకు ఒక యువకుడికి అవకాశం ఇవ్వటం ద్వారా కాంగ్రెస్‌ తనలో వస్తున్న మార్పును చెప్పకనే చెప్పింది. కానీ అధికారంలో
ఉన్న బీజేపీ అలాంటి ప్రయత్నాలేవీ చెయ్యకపోవటం ఆశ్చర్యంగానే ఉంది. దానికి తోడు విజయం వెనుక పరిగెత్తాలన్న బీజేపీ ఆత్రుత వారి ప్రతి అడుగులోనూ కనిపిస్తోంది. గవర్నర్‌గా ఉన్న తమిళసైకి ఎంపీ టికెట్‌ ఇచ్చి బరిలో దించటం వెనుక కారణం తెలుసు కోలేనంత అమాయకత్వంలో ప్రజలు లేరు.
మేల్కోకపోతే.. కోల్పోతారు!
అదృష్టవశాత్తు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో సింహభాగం మీడియా ఇంత విస్తృతంగా లేదు. అందుకే కాంగ్రెస్‌ తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవటానికి సమయం పట్టింది. కానీ బీజేపీ విషయంలో మాత్రం పరిస్థితి అలా లేదు. మీడియా చాలా అభివృద్ధి చెందింది. తప్పిదాలను ఇట్టే పసిగట్టే పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. ఈ సమయంలో పాత కాంగ్రెస్‌లా మారే ప్రయత్నం బీజేపీకి చేటు తెస్తుంది. కొన్ని విషయాలను వారి భాషలోనే చెబితే బలంగా అర్ధమౌతుంది. అందుకే కఠోపనిషత్తులోని ఈ వాక్యాన్ని ఈ సమయంలో గుర్తు చేయటం సబబుగా ఉంటుందేమో. స్వామి వివేకానంద సైతం అనేక సందర్భాల్లో ఇదే విషయాన్ని గుర్తు చేశారు.
ఉత్తిష్ఠత! జాగ్రత!
ప్రాప్యవరాన్‌ నిబోధత క్షురస్య ధారా
నిశితా దురంతయా దుర్ల పథస్తత్కవ యోవదంతి
లేవండి..! మేల్కొనండి..! గమ్యాన్ని చేరే వరకూ విశ్రమించకండి. నడవాల్సిన మార్గం మరింత దుర్గమమైనది. ఇలాంటి దుర్గమమైన మార్గంలో సరిగా నడవాలంటే ఏనుగు మీద కూర్చుని నడిస్తే సరిపోదు. కిందకు చూడాలి. అవసరమైతే కిందకు దిగాలి. పరిస్థితిని అంచనా వేసుకోవాలి. ప్రణాళికలు రచించు కోవాలి. ఏనుగు మీద కూర్చునే ప్రణాళికలు రచిస్తా మంటే మాత్రం అది కాంగ్రెస్‌కు బలంగా మారుతుం దనే విషయాన్ని బీజేపీ గుర్తించాలి. ఓడిపోయినా కొత్త తప్పిదాల ద్వారా ఓడిపోతే ఫర్వాలేదు. కానీ పాత తప్పిదాల ద్వారా ఓడితే మాత్రం దిద్దుకోవటం చాలా కష్టం. అందుకే వాళ్ళు వీళ్ళుగా మారే క్రమం నుండి బీజేపీ ఇప్పటికైనా బయటపడాలి..!

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here