Home సంపాదకీయం నోరూరించే పండ్లు!.. రసాయనాలతో కడగండ్లు!

నోరూరించే పండ్లు!.. రసాయనాలతో కడగండ్లు!

ప్రకృతి మానవుడికి ప్రసాదించిన గొప్ప వరం..పండ్లు. మంచి ఆరోగ్యానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే పండ్లు బాగా తినండి..ఆరోగ్యంగా ఉండండి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే, ఇప్పుడా కాలం పోయింది. పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటామన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎక్కడ చూసినా కల్తీలు, నాశిరకం తిండ్లు వెల్లువెత్తుతున్న నేటి సమాజంలో ‘మంచి పండ్లు’ దొరుకుతా యనుకోవడం కూడా కేవలం ఒక భ్రమగానే ఉంటోంది. డబ్బులిచ్చి మరీ అనారోగ్యాన్ని చేతులారా మనమే కొనుక్కుం టున్నామా అనిపిస్తోంది. ఇది, ఏ ఒక్కచోటో కాదు, దేశ వ్యాప్తంగా అనేక మార్కెట్లలో ఈ బాగోతం నడుస్తూనే ఉంది. అనేకమంది వ్యాపారులు తమ స్వలాభం కోసం, ఏదోఒక విధంగా కోట్లు సంపాదించాలనే స్వార్ధంతో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టేస్తున్నారు. ఆరోగ్యకరమైన పండ్లను కూడా రసాయనాలతో కలిపి అటు వాటినీ, ఇటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తున్నారు. ఎవరెటుపోతే మాకేం..మాకు కావాల్సింది డబ్బే అన్న నినాదంతో, అక్రమవ్యాపారులు పండ్ల వ్యాపారాన్ని కూడా విషతుల్యం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు అని తెలిసినా కల్తీవ్యాపారులు పట్టించుకోవడం లేదు. అడ్డదారుల్లో రసాయనాలను వినియోగిస్తూనే ఉన్నారు. ఆ విషయం తెలిసి పండ్ల మార్కెట్లపై అధికారులు దాడులు చేస్తున్నా, జరిమానాలు విధిస్తున్నా లెక్కచేయడం లేదు. అలాంటి అనైతిక, అక్రమ వ్యాపారాలు చేయొద్దని ఒకవైపు న్యాయస్థానాలు, మరోవైపు ప్రభుత్వాలు ఎన్నిసార్లు హెచ్చ రిస్తున్నా అక్రమార్కుల తీరు మారడం లేదు. ప్రజారోగ్యాన్ని మట్టుపెడుతున్న ఇలాంటి అక్రమవ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప, దేశంలో ఈ దుస్థితి మారేలా లేదు. అందులోనూ ఈ వేసవిలో రకరకాల పండ్లకు మార్కెట్లో డిమాండ్‌ బాగా ఉంటుంది. ఇదే అదనుగా వ్యాపారులు తమ అక్రమార్జనకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో మామిడిపండ్లు చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. మధుర ఫలంగా పేరుగాంచిన మామిడిపండ్లు బంగారు రంగుతో నిగనిగలాడుతుంటాయి. తీరా వాటిని కొని, ఇంటికి తీసుకు వెళ్ళి తింటే.. ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా ఆసుపత్రులకు పెట్టాల్సిన దుస్థితి. ఎందుకంటే, మార్కెట్లోకి వచ్చే అనేక పండ్లలో అధికశాతం విషపూరితమైన రసాయనాలతో
ఉంటున్నాయని ఆహారభద్రతా అధికారులు కూడా హెచ్చ రిస్తున్నారు. పండ్లు పక్వానికి రాకముందే, అవి మంచి రంగుతో నిగనిగలాడుతూంటే ఎక్కువమంది కొంటారనే దురాశతో అక్రమవ్యాపారులు రహస్యంగా వాటిని రసాయనాలతో కలిపి, అసహజమైన రీతిలో వాటిని పక్వానికి వచ్చేలా చేస్తున్నారని, కనుక వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మెరిసిపోయే యాపిల్‌, పసుపువర్ణంలో మామిడి, పసుపు పచ్చగా ఉండే అరటిపండ్లు వంటివి.. అలా మంచి రంగుతో అందరినీ ఆకట్టుకునేలా, తద్వారా తమ వ్యాపారం మూడు కాయలు.. ఆరుపండ్లు అన్నట్లుగా జరిగేలా వ్యాపారులు ఈ మోసాలకు పాల్పడుతున్నారు.
వాస్తవానికి సాధారణ ప్రజలే కాదు, విజ్ఞులైనవారు కూడా మార్కెట్లలో తరచూ మోసపోతూనే ఉంటారు. అందమైన పండ్ల మాటున అనారోగ్యం పొంచి ఉంటుందని ఎవరనుకుం టారు?.. కానీ, ఈ కలికాలంలో.. కల్తీకాలంలో, వ్యాపారుల మాయాజాలంలో ఏది అసలీయో..ఏది కల్తీయో కనిపెట్టడం అంత సులభం కాదు. రానురాను రసాయనాలు లేని పండ్లు దొరకడం కూడా కష్టంగానే ఉంటోంది. అందరూ ఎక్కువగా కోరుకునే మామిడి, పైనాపిల్‌, సపోటా, ద్రాక్ష, బొప్పాయి వంటి పండ్లు కూడా మార్కెట్లలో చూసేందుకు భలే బాగుంటున్నా, వాటిని త్వరగా మగ్గబెట్టేందుకు కాల్షియం కార్బైడ్‌, ఇథిలిన్‌ వంటి రసాయనాలు వాడుతున్నారని, దాంతో వాటిలో
ఉండే పోషకపదార్ధాలు కూడా దెబ్బతిని, తిన్నవారికి జబ్బులు వస్తున్నాయని, అలాంటి పండ్లను తినడం వల్ల వాంతులు, విరోచనాలు, జీర్ణకోశ వ్యాధులు, కిడ్నీ జబ్బులు వంటివెన్నో వస్తాయని, కనుక జాగ్రత్త తప్పదంటున్నారు నిపుణులు. అందువల్ల రసాయనాలు కలిపిన పండ్లను గుర్తించాలని, మామూలు పండ్లకి`రసాయనాలు కలిపిన పండ్లకీ తేడా
ఉంటుందని పేర్కొంటున్నారు.
ఎందుకైనా మంచిది.. మార్కెట్‌ నుంచి తెచ్చుకున్నాక ఆ పండ్లను ఉప్పునీటిలో కొంతసేపు బాగా నానబెట్టి, ఆ తర్వాత శుభ్రం చేసుకుని తినడం కొంతలో కొంతైనా శ్రేయస్కరమని సూచిస్తున్నారు. ఏదేమైనా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇలాంటి మోసాలను, అరికట్టేందుకు ప్రభుత్వాలు మరింత కఠినచర్యలు తీసుకోవాల్సి ఉంది. అవసరమైతే, చట్టాలను సవరించైనా సరే, ఈ అక్రమాలను నిరోధించాల్సి ఉంది.

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here