Home కలలను పండించే కలం

కలలను పండించే కలం

నీతి, నిజాయితీ, నిబద్ధతలే కొలమానాలుగా, ఓ చారిత్రాత్మక సంస్థని, సంస్థ ఆస్తులని కాపాడడానికి చైతన్యస్ఫూర్తితో 1981 జూన్ 5న ప్రారంభించబడింది మా(మీ) లాయర్ వారపత్రిక.

నిజాన్ని నిర్భయంగా చెప్పే పత్రికగా, నెల్లూరీయుల మనసెరిగిన సేవాదీపికగా, వాస్తవాలను జంకూబొంకూ లేకుండా వెలుగులోకి తెచ్చే సత్యవేదికగా, సమాజశ్రేయస్సు కోసం ఆవిర్భవించిన వార్తా వీచికగా ప్రతి నెల్లూరీయుడూ గుండెల్లో దాచుకునే ప్రియపుత్రికగా లాయర్ ను తీర్చిదిద్దారు వ్యవస్థాపకులు తుంగా రాజగోపాలరెడ్డి గారు.

ఈ సమాజం మనకేం ఇచ్చింది అని అనుకోవడం కన్నా ఈ సమాజానికి మనమేం చేశాం అన్న ఆలోచన రాజగోపాలరెడ్డి గారిలో ఒక ఆశయానికి నాంది పలికింది. రాజకీయ, సాంఘిక, సాహిత్య, ఆర్థిక, సామాజిక సమస్యల పరిష్కారం కోసం అన్ని వర్గాల అభిప్రాయాలను, అభిరుచులను, ఆకాంక్షలను ప్రజల ముందుంచి వారి కలలను పండించే కలంగా లాయరం అవతరించింది.

ఎందరో మహనీయులు, మహాత్ములు, మహానుభావులు అందించిన ఆశీస్సులను, ప్రశంసలనూ మూటకట్టుకుంటూ 2006 జూన్ లో సాక్షాత్తూ ఆనాటి ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి గారి సమక్షంలో రజతోత్సవ సంబరాలను కమనీయంగా జరుపుకుంది. ఆయన సువర్ణహస్తాలతో తనకంటూ ఓ సొంత కార్యాలయాన్ని ప్రారంభించుకోగలిగింది. ఆయన నోట ప్రశంసల వర్షాన్ని తన సొంతం చేసుకోగలిగింది మా(మీ) లాయర్.

ఒక సత్సంకల్పంతో, సదాశయంతో, సద్భావనతో ఆయన అందించిన స్ఫూర్తికి కీర్తిని జోడించుకుంటూ, ఆయన వెలిగించిన జ్యోతితో వెలుగులు విరజిమ్ముకుంటూ ఆయన పాటించిన నైతిక విలువలను, ఆచరించిన ఉన్నత ప్రమాణాలను కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది మా(మీ) లాయర్.