Home అక్షరాభిషేకం

అక్షరాభిషేకం

దినపత్రికలు సైతం సాహసించలేని సాహితీ యజ్ఞానికి ప్రత్యేక సంచిక రూపంలో శ్రీకారం చుట్టింది మా(మీ) లాయర్. లాయర్ చేపట్టిన ఈ సరిక్రొత్త ప్రక్రియలో భాగంగా జిల్లా అథ్యాత్మిక రంగానికి పెద్దపీట వేసిన ఆలయాల సంచిక, జిల్లా విద్యారంగపు గుబాళింపులను పరిమళింపజేస్తున్న విద్యావేత్తల కృషి దీపికగా వెలువడిన ప్రత్యేక జ్ఞాపిక, మొలగొలుకులు పండించే జిల్లా మొనగాళ్ళకు జన్మనిచ్చిన ఖిల్లా అంటూ నెల్లూరు వరిపై వెలువరించిన సమాచారవేదిక, జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్న వైద్యదేవుళ్ళకు అంకితమైన వైద్యాలయాల ప్రత్యేక సంచిక… ఇవన్నీ వారంవారం వెలువడే లాయర్ కు తోడుగా మాసం మాసం వచ్చిన అభివృద్ధి సూచికలుగా నెల్లూరీయుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

ప్రజాసేవాపథంలో పునీతులైన మహోన్నత వ్యక్తులపై విశిష్ఠ సంచికలను వెలువరించిన ఘనత లాయర్ ది. బ్రతుకంతా బృందావనమేనంటూ డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారి సాహితీ రసజ్ఞతను తొలిసారిగా తేటతెల్లం చేసింది లాయర్ మాత్రమే. బెజవాడ రామచంద్రారెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాగుంట సుబ్బరామరెడ్డి, జి.వి.కె.రెడ్డి వంటి మహామహుల వదాన్యతకు నిలువెత్తు దర్పణంగా వెలువడిన లాయర్ సంచికలు ఉత్తమోత్తమ జర్నలిజానికి సూచికలు.