Home సినిమా వార్తలు నవరసాల నటుడు.. తెలుగువారి ‘యముడు’… ‘కైకాల’.. ఇక లేడు

నవరసాల నటుడు.. తెలుగువారి ‘యముడు’… ‘కైకాల’.. ఇక లేడు

తెలుగోళ్ళ పాతతరం మహానటులు.. నవరసనటనా దురంధరులు.. ఒకరొకరుగా వెళ్ళి పోతున్నారు. అఖిలాంధ్ర ప్రేక్షకుల మనసులు దోచుకున్న అగ్రనాయకులు, ప్రతినాయకులు తెలుగువారికి కంటనీరు మిగిల్చి..ఒకరి వెంట ఒకరు..దూరతీరాలకు తరలిపోతున్నారు. మొన్నటికి మొన్న డ్యాషింగ్‌ హీరో..కృష్ణ.. ఆ తర్వాత..విలనీలో అగ్రతాంబూలం అందుకున్న కైకాల…నిన్నటికి నిన్న చలపతిరావు.. మృత్యుఒడికి చేరుకోవడంతో.. చిత్రసీమ విషాద సీమగా మారింది. అభిమానులు విలవిలలాడుతుంటే.. వెండితెర నాటి మెరుగులు మెరుపులు కోల్పోయి వెలవెలబోతోంది. ఎంతటి క్లిష్టమైన పాత్రనైనా అవలీలగా పోషించే విలక్షణ నటనా చాతుర్యంతో తెలుగు చలనచిత్రసీమకు ఎనలేని ఖ్యాతి తెచ్చిన నటసింహం.. కైకాల సత్యనారాయణ డిసెంబరు 23వ తేదిన, తన 87వ ఏట హైదరాబాద్‌లోని తన నివాసంలో అస్వస్తతతో… తుదిశ్వాస విడిచారు. ఆయన లేని లోటు ఎవరు తీర్చగలరు?…
నటనలో మేటి…విలనీలో ఘనాపాటి!..విలక్షణ పాత్రల్లో..తనకు తనే సాటి!..ఆయనే కైకాల సత్యనారాయణ. అది సాంఘిక చిత్రమైనా, జానపదమైనా, పౌరాణికమైనా ఏదైనా సరే, తనకంటూ ఓ పాత్ర ఇస్తే చాలు..ఆ పాత్రకు జీవం పోసే మహానటుడు..కైకాల. ఆయన నటన ఎంతో విల క్షణంగా ఉంటుంది. డైలాగ్‌లు చెప్పే తీరే ఒక ప్రత్యేకతగా ఉంటుంది. ‘ఆయ్‌!..యముండ’ అని ఆయనంటే చాలు..నిజంగానే యముడొచ్చి హుంకరిస్తున్నట్లుగా ఉంటుంది. యముడంటే ఎలా
ఉంటాడో.. కైకాలను చూస్తే..అచ్చం అలానే ఉంటాడనిపిస్తుంది. ఆ వేషం, పాత్రోచితంగా నటించే ఆ నేర్పు, ఆయనకు అత్యంత సహజం. అది నటన కాదు.. జీవించడమేననిపిస్తుంది. అందుకే ఆయన సహజనటులని ఖ్యాతిపొందారు. నవరసాలను సైతం అత్యంత సునాయాసంగా పోషిస్తూ… ‘నవరస నటనా సార్వభౌమునిగా’ విఖ్యాతి చెందారు. అటు పాతతరం, ఇటు నేటి కొత్తతరం ప్రేక్షకులకు ఆయనంటే అభిమానం. అది దుష్టపాత్ర అయినా, మంచిపాత్రే అయినా..ఆయన నటనంటే ఇష్టం.
60 ఏళ్ళలో..8 వందల సినిమాలు
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామం ఆయన స్వస్థలం. 1935 జులై 25న ఆయన జన్మించారు. విద్యార్ధి దశ నుంచీ నాటకరంగంపై ఆసక్తితో ఎన్నో నాటకాల్లో నటించారు. నటనారంగంపై మక్కువతో సినిమారంగంలోకి వచ్చి 1959లో ‘సిపాయికూతురు’ సినిమాలో హీరోగా తెరంగేట్రం చేశారు. ఇక అక్కడినుంచీ ఆయన వెనుదిరగలేదు. జానపదబ్రహ్మ విఠలాచార్య ప్రోత్సాహంతో విలన్‌ (ప్రతినాయకుడు)గా అనేక చిత్రాల్లో నటించి విలనిజానికే ప్రఖ్యాతిని తెచ్చారు. కరుణరసం ఒలికించే పాత్రలొచ్చినా సరే.. ఓకే అన్నారు. అమోఘమైన నటనతో అన్నిరకాల పాత్రల్లో రాణించారు. వందలాది చిత్రాల్లో అనేకరకాల పాత్రలు ధరించారు. పలానా పాత్రలో ఆయన బాగాలేరు..అన్న మాటే ఎక్కడా రాలేదు. ఏ పాత్ర ఇచ్చినా అందులో ఆయన ఇమిడిపోయేవారు. అందుకే తన 60 ఏళ్ల సుదీర్ఘ సినీజీవిత ప్రస్థానంలో దాదాపు 800 సినిమాలకు పైగానే నటించారంటే.. సినీప్రేక్షక లోకంలో ఆయన ప్రభావం ఎంతగా ఉండేదో తేటతెల్లమవుతుంది.
విలన్‌ అంటే..కైకాలే
నిలువెత్తు రూపం, గంభీరమైన కంఠస్వరంతో సుయోధనుడిగా, రావణాసురునిగా, యుమునిగా..ఏ పాత్రకాపాత్రే తన సొంతం అన్నట్లుగా నటించి, ఆ పాత్రలకే పేరు తెచ్చారు. శ్రీకృష్ణార్జున యుద్ధంలో కర్ణునిగా, నర్తనశాలలో దుశ్వాసనునిగా, పాండవ వనవాసంలో ఘటోత్కచునిగా, దానవీరశూర కర్ణలో భీముడిగా కైకాల నటన అద్భుతం.. అద్వితీయం. రాక్షసపాత్రలకు కూడా ఆయన జీవం పోశారు. విలనీ అంటే ఏమిటో తెలుగుప్రేక్షకులకు కన్నులకు కట్టినట్లు చూపారు. అదేవిధంగా సాంఘిక సినిమాల్లో ఎన్నో మంచిపాత్రల్లోనూ ఆయన నటన అమోఘం. ప్రతిపాత్రలోనూ ఆయన జీవించి.. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సినిమాల్లో విలన్‌ అయినా, ఎన్నో దుష్టపాత్రలను పోషించినా..నిజజీవితంలో ఆయనెంతో సహృదయులు. ప్రజలంటే ఎనలేని అభిమానం. ప్రజలకు కూడా ఆయనంటే ఎంతో అభిమానం. అందుకే, మంచి నటునిగానేకాక, ప్రజాక్షేత్రంలోనూ ఓ మంచి నాయకునిగా.. పార్లమెంట్‌ సభ్యునిగా కూడా కైకాల సత్యనారాయణ తనదైన శైలితో రాణించి ప్రజాసేవలో తరించారు. అశేష ప్రేక్షకుల విశేషాదరణ పొందిన నవరస నటనాచతురుడు కైకాల… లేకపోవడం తెలుగు ప్రేక్షకలోకానికి తీరని లోటు.

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here