Home రాష్ట్రీయ వార్తలు దేవుళ్లు.. రాజకీయాలు!

దేవుళ్లు.. రాజకీయాలు!

అదేం ఖర్మో తెలియదు కానీ, మనదేశంలో రాజ కీయం లేని చోటు అంగుళమైనా కనిపించడం లేదు. చివరికి దేవాలయాలను కూడా ఆ దిక్కుమాలిన రాజ కీయాలే శాసిస్తున్నాయి. భక్తులు, ఆధ్మాత్మికవేత్తలకు నిలయాలుగా ఉండాల్సిన దేవాలయాలు రాజకీయ నాయకుల పాలబడుతున్నాయి. దేవాలయాల ఆలనా పాలనా చూసే పాలకమండళ్ళలోనూ రాజకీయనాయకు లదే అగ్రాసనం. చివరికి దేవాలయాల్లో అటు దేవుళ్ళకు, ఇటు భక్తులకు పెట్టే ప్రసాదాల మీద కూడా వాళ్లదే పెత్తన మైపోతోంది. దర్శనం టిక్కెట్లు కావాలన్నా, ప్రసాదాలు కావాలన్నా ఏదైనా సరే రాజకీయనాయకుల సిఫార్సు లుంటే చాలు. డబ్బు, పలుకుబడి ఉంటే ఏ దేవాలయంలో నైనా దర్శనాలకు లోటుండదు. సామాన్యభక్తులకు మాత్రం క్యూలల్లో పడిగాపులు తప్పవు. భక్తులకు`దేవుడికి మధ్య ఈ రాజకీయాలేమిటో ఆ దేవుడికే తెలియాలి. పెద్దపెద్ద దేవాలయాల్లోనే కాదు, చిన్నచిన్న గుళ్ళలో కూడా ఈ రకమైన సంస్కృతి ప్రబలిపోతోంది. వాస్తవానికి ఆ ఆలయాభివృద్ధికి సహకరించే పెద్దలను ఆలయం తరఫున గౌరవించుకోవాల్సిన సందర్భాలుంటాయి. అలాంటి వాటిని ఎవరూ కాదనరు. అవి అవసరం కూడా. కానీ, ఏ చోటారాజకీయనాయకుడు వచ్చినా, భక్తులందరినీ అలాగే క్యూలల్లో నిలబెట్టేసి, గుళ్ళో దేవుడిని కూడా వదిలేసి పూజారులతో సహా పరుగెత్తుకువెళ్ళి ఆహ్వానిస్తుండడమే విచారకరం. కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంక టేశ్వరుని సన్నిధిలోనైతే..వీఐపీలు వస్తే చాలు..సామాన్యు లకు దైవదర్శనం కోసం గంటల తరబడి క్యూలలో పడి గాపులు కాయాల్సిందేనని భక్తులు గగ్గోలు పెడుతూనే
ఉంటారు. కానీ, పట్టించుకునేదెవరు?.. అలాంటి గొప్ప దేవాలయాల్లో పాలక మండలి సభ్యులు కావాలంటే తమాషా కాదు. కోట్లు చేతిలో ఉంటే తప్ప కుదర దని అంటుంటారు. అయినా దేవుడి వద్ద కూడా ఇంత రాజకీయమా?.. అయోధ్యలో రామమందిరం ఎంతో గొప్ప కార్యం. అంతటి మహోన్నత కార్యాన్ని కూడా రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వినవస్తూనే ఉన్నాయి కదా!.. దేవుళ్ళను ఆరాధించడం, ఆలయాలను అభివృద్ధి చేయడం మంచిదే కానీ.. దేవుళ్ల పేరుతో వ్యక్తిగత ప్రతిష్టలను, రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించడం ఎంతటివారికైనా సరే..ఎంతవరకు సమంజసం?..ఆలయాల్లో పాలకమండళ్లను పటిష్టం చేసి, తద్వారా దేవుళ్ళకు చేయాల్సిన కైంకర్యాలను, లేదా ఉత్సవాలను మరింతగా అద్భుతంగా చేయాల్సిందిపోయి, ‘దేవుడు చూడడం లేదులే’ అనుకొని.. తమ చిత్తానుసారం వ్యవహరించడం, సామాన్య భక్తులను చులకనగా చూడడం వంటివాటిని దేవుడు మెచ్చుతాడా?.. ఇటీవలి కాలంలో అనేక దేవాలయాల్లో జరిగే ఉత్సవాలు కూడా ఆయా పార్టీల వారి కనుసన్నల్లోనే జరగాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. జనం గుంపులుగా చేరిన కాడల్లా తమ పార్టీపేరు చెప్పుకోవడం, లేదా తాము ఒక పెద్ద హీరోలా కనిపించి జనంలో గొప్ప నాయకుడిలా వ్యవహరించడం మామూలైపోతోంది. అయితే, నిజమైన భక్తి కలిగినవాళ్ళు రాజకీయ నాయకులైనా.. కాకపోయినా వారిని తప్పకుండా అందరం గౌరవించుకోవాల్సిందే. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. కానీ, అసలు దేవుడంటే నమ్మకం లేనివాళ్లు కూడా కొన్ని ఆలయాల్లో తమ మాటే వేదంగా చెలాయించు కోవడం, మరికొందరు రాజకీయ ప్రాబల్యంతో పాలక మండళ్ళలో చేరి దేవుళ్ళనే శాసిస్తున్నట్లుగా వ్యవహరిస్తుండ డాన్ని ఏమనుకోవాలో అర్ధం కాదు. పీఠాధిపతులు, అర్చకులు, వేదపండితులు, ఆధ్యాత్మికవేత్తల సలహాలను పాటించకుండా ఎవరిపాటికి వారు తాము చెప్పిందే వేదం అనుకోవడం పరిపాటైపోతోంది. భక్తితో దేవుళ్ళను కొలుచుకునేవారికి దేవాలయాల్లో కానీ, పాలకమం డళ్ళలో కానీ స్థానం లేకపోవడం, డబ్బు`రాజకీయ బలం ఉన్నవారికి మాత్రం అవి వేదికలు కావడం..కలియుగ ధర్మం కాబోలు!.. దేవుళ్ళ ఆశీస్సుల కంటే రాజకీయనాయ కుల ఆశీస్సులే నేటి సమాజంలో బాగా పనిచేస్తుండడం కాలమహిమో ఏమోమరి!.. ఏదేమైనా అలాంటి పద్ధతులు, గుళ్ళ రాజకీయాలు పోవాలి. దేవుడి ముందు అందరూ సమానమనే భావన రావాలి. భక్తికి నిలయా లుగా, ధర్మానికి నెలవుగా ఉండాల్సిన దేవాలయాల్లో రాజకీయాల ప్రాబల్యం ఎంతమాత్రం మంచిది కాదు. ఆలయాల్లో ఏ చిన్న ఉద్యోగం వచ్చినా, చీపురు చేతపట్టి చెత్త వూడ్వాల్సివచ్చినా, పాలకమండళ్ళలో చోటు దొరికినా.. ఆ దేవుని సేవాభాగ్యం లభించినట్లే. అంతకన్నా అదృష్టం ఏముంటుంది?.. అలాంటి సేవ పూర్జజన్మ సుకృతంతోనే లభిస్తుంది. చిత్తశుద్ధితో చేసే సేవలతో ఆ భగవంతుని అనుగ్రహం పొందాల్సింది పోయి, అనుచితమైన కార్యా లతో కలుషితం చేసుకోవడం వల్ల ఆ భగవంతుడిచ్చిన అద్భుత అవకాశాన్ని.. చేజేతులా పోగొట్టుకోవడమే కదా!.. ఓసారి మనసుపెట్టి ఆలోచించండి!

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here