Home రాష్ట్రీయ వార్తలు స్థానిక పోరుకు.. వెనకడుగు

స్థానిక పోరుకు.. వెనకడుగు

2014 ఎన్నికల్లో వైసిపి పరాజయానికి టీడీపీ విజయానికి అనేక కారణా లున్నాయి. మోడీ ఇమేజ్‌, పవన్‌కళ్యాణ్‌ మద్దతు, ఋణమాఫీ, చంద్రబాబు అను భవం, జగన్‌పై అవినీతి కేసులు, అతనిపై మతపరమైన ముద్ర… ఇతరత్రా కారణాలు. ఇవే కాదు, తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కోర్టులు కూడా పరోక్షంగా దోహదం చేసాయి.

అదెలాగంటే… 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక ఎన్నికలు నిర్వ హించాలనే ఆలోచన ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేదు, అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ కూడా ఇచ్చేసారు. అయితే కొందరు వేసిన పిటిషన్‌లను విచారించిన హైకోర్టు, అసెంబ్లీ ఎన్నికలకంటే ముందే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, ఫలితాలను మాత్రం అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రకటించాలని తీర్పునిచ్చింది. దీంతో ముందుగా స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చింది. దీని మూలంగా గ్రామాలలో గ్రూపులు ఏర్పడ్డాయి. వై.యస్‌. అభిమానులు కొన్నిచోట్ల స్థానికంగా వున్న పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశంలోకి వెళ్ళాల్సిన పరిస్థితులొచ్చాయి. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశంకు పనిచేసిన వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాగే వుండిపోయారు. దానివల్ల వై.యస్‌. సానుభూతి ప్రభావం పనిచేయకుండాపోయింది. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే స్థానిక ఎన్నికలు నిర్వహించడం తెలుగుదేశంకు బాగా కలిసొచ్చింది!

మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏంటన్నది ప్రశ్న? పంచాయితీ ఎన్నికల గడువు అయిపోయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయితీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. కాని, ముందుగా పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ప్రభు త్వానికి వ్యతిరేకంగా వస్తాయనే అంచనా వుంది. పంచాయితీ ఎన్నికలు పూర్తిగా గ్రామాలు, పల్లెటూర్లకు సంబంధించినవి. ఎక్కువుగా రైతులతో సంబంధం వున్న ఎన్నికలు. ఈ నాలుగేళ్ళలో రైతాంగానికి ఒరిగిందేమీ లేదు. ఋణమాఫీ పెద్ద ఫ్లాప్‌. ఇక పంటలకు గిట్టుబాటుధరలు లేకపోవడర వంటి సమస్యలు వుండనే వున్నాయి. పంచాయితీల తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలకు వెళ్ళాలి. ఇవి కూడా గ్రామాలకు సంబంధించిన ఎన్నికలే! ఈ ఎన్నికలు నిర్వహించినా ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలే వస్తాయి. ఈ రెండు ఎన్నికల ప్రభావం తర్వాత నిర్వహించాల్సిన కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికలపై పడుతుంది. ఇక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత బయటపడితే రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్‌ సరళి ఆటోమేటిక్‌గా మారిపోతుంది. ఇది ఊహించబట్టే చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి అయిష్టంగా వున్నట్లు తెలుస్తోంది.

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here