Home జిల్లా వార్తలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి దంపతులు టీడీపీలో చేరిక

వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి దంపతులు టీడీపీలో చేరిక

మార్చి 2న ముహూర్తం
చంద్రబాబు రాక కోసం ముస్తాబవుతున్న వీపీఆర్‌ వేదిక
మారుతున్న జిల్లా రాజకీయం!
నెల్లూరుజిల్లా రాజకీయం మొత్తం ఒక్కసారిగా మారిపోతోంది. వైసీపీ కంచుకోటగా ఉన్న జిల్లా ఆ పార్టీ చేజారిపోతోంది. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశంపార్టీలో చేరనుండడంతో, జిల్లా రాజకీయాలు కొత్త రూపం సంతరించుకోబోతున్నాయి. తిరుమల తిరుపతి దేవదేస్థానాల పదవులలో కొనసాగుతున్న ప్రశాంతిరెడ్డి ఎప్పుడూ అధికారికంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. ఇప్పుడు ఆమె కూడా పచ్చ కండువా కప్పుకోనున్నారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. నిన్నటివరకూ మూడురంగులతో ముస్తాబైన వీపీఆర్‌ వేదిక, ఇప్పుడు పసుపుదనంతో మెరిసిపోనుంది. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారని తెలియగానే జిల్లా తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులంతా వీపీఆర్‌ నివాసంలో వాలిపోయారు. టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు కార్యకర్తలతో పాటు వీపీఆర్‌ అనుచరులు, అభిమానులు వేల సంఖ్యలో రోజూ ప్రభాకరరెడ్డి ఇంటికి చేరుకొని ఆయనకి మద్దతుగా నిలుస్తున్నారు. వైసీపీ స్థానిక నాయకులతో, అధిష్ఠానం వైఖరితో అసంతృప్తితో ఉండిన మండల, నగర స్థాయి నాయకులు ఒక్కొక్కరుగా జగన్‌ పార్టీకి రాజీనామా చేసి బయటకి వస్తున్నారు. కొంతమంది అగ్రనాయకులు కూడా త్వరలో వైసీపీ నుండి బయటకి రానున్నారని తెలుగు తమ్ముళ్ళ సమాచారం. నిన్నటిదాకా ధనవంతులు, కోటీశ్వరులు తమకు వంచన చేస్తున్నారని వీపీఆర్‌ని ఉద్దేశించి పరోక్షంగా గొంతు చించుకుని అరచిన వారే ఇప్పుడు క్రమేణా ప్రభాకరరెడ్డి పంచన చేరుతున్నారు, అంతా తామే అన్నట్లుగా హడావుడి చేసేస్తున్నారు. ఒక్కసారిగా అందరి ప్రాధాన్యతలు మారిపోయాయి, ప్రేమాభిమానాలు పెరిగిపోయాయి, నిన్నటివరకు అరుచుకున్నవారు ఇప్పుడు కరుచుకుంటున్నారు… ఇదే మరి రాజకీయమంటే!
మార్చి 2 ఉదయం 10 గంటలకి ముహూర్తం
మార్చి 2వ తేదీ శనివారం వీపీఆర్‌ దంపతుల తెలుగుదేశం పార్టీ ప్రవేశానికి ముహూర్తం ఖరారుచేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో ప్రభాకరరెడ్డి – ప్రశాంతిరెడ్డి పార్టీలో చేరబోతున్నారు. వారితో పాటు ఇంకా చాలామందే టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారని తెలు స్తోంది. ఆరోజు ఉదయం 10గంటలకి వీపీఆర్‌ అభిమానులు, అనుచరులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీ శ్రేణులు గొలగమూడి రోడ్డులోని వీపీఆర్‌ కన్వెన్షన్‌కి చేరుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా ఉన్న మండలస్థాయి నాయకులను వేమిరెడ్డి ప్రభాకరరెడ్డే స్వయంగా ఫోన్‌ ద్వారా పలకరించి ఆహ్వా నిస్తున్నారు. పార్టీలకతీతంగా అందరికీ ఆయన కాల్‌ చేస్తున్నట్లు సమాచారం. వీపీఆర్‌ రాజీనామా చేయకముందు, ఆ తరువాత అన్నట్లుగా నెల్లూరు జిల్లా రాజకీయం మారిపోనుందని వేమిరెడ్డి అభిమానులు చెప్తున్నారు. వీపీఆర్‌ పార్టీలో చేరే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. వేల సంఖ్యలో జనం పాల్గొంటారని అంచనాలు ఉండడంతో నాయకుల ప్రసంగాలు అందరికీ వినపడేలా కనుపర్తిపాడు వరకూ మైకులను ఏర్పాటు చేస్తున్నారు. వీపీఆర్‌తో పాటు ఎవరెవరు టీడీపీలోకి వెళ్ళబోతున్నారన్నదానిపైన ఇంకా స్పష్టత రాలేదు.
రాష్ట్రమంతా ఇదే చర్చ…
వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలలో టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా మారారు. ఆయన తొలి నుండి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత అంతరంగికుడు. గతంలో కూడా 2017లో ఒకసారి జగన్‌పై అలిగి టీడీపీలో చేరాలనుకున్నారు, కానీ అప్పుడు చివరి నిముషంలో చంద్రబాబు పర్యటన రద్దు కావడంతో వీపీఆర్‌ చేరిక వాయిదా పడి ఆగిపోయింది. ఆ తరువాత ఆయన వైసీపీతోనే రాజీపడిపోవడం, 2018లో ఆయనని రాజ్యసభ వరించడం తెలిసిందే. తాను అమితంగా ఆరాధించే శ్రీ వెంకటేశ్వరస్వామే ఆయనకి సహకరించి ఆయనని అప్పట్లో టీడీపీలోకి వెళ్లకుండా ఆపారని వీపీఆర్‌ అభిమానులు గట్టిగా నమ్ముతారు. ఇప్పుడు వీపీఆర్‌ దంపతులు తెలుగుదేశంలోకి వెళ్లడం ఖచ్చితంగా ఖాయమైపోయింది. ఇంక ఒక్కరోజే సమయముంది కాబట్టి ఇంక ఆగే ప్రసక్తే లేదు. అయితే, సాక్షాత్తూ ఆ ఏడుకొండలవాడే ఈసారి వీపీఆర్‌ని టీడీపీలోకి పంపిస్తున్నాడని, ఆయనకి అంతా మంచే జరుగుతుందని వేమిరెడ్డి అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. వేమిరెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయవర్గాల్లో సైతం పెద్ద చర్చనీయాంశమయ్యింది. ఆయన పార్టీ నుండి బయటకి వెళ్ళడానికి చూపిస్తున్న కారణం చాలా చిన్నది. ఇంకేదో జరిగిందన్నది రాజకీయవర్గాల అనుమానం. కేవలం అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఉదంతాన్నే సాకుగా చూపిస్తున్నారని, కానీ వీపీఆర్‌తో పోల్చుకుంటే అనిల్‌ స్థాయి చాలా చిన్నదని, కాబట్టి అసలు కారణం అది కాదన్నది వారి అభిప్రాయం. అంతర్గతంగా ఏం జరిగిందో వేెమిరెడ్డికి, జగన్‌మోహన్‌రెడ్డికే తెలియాలి అంటున్నారు విశ్లేషకులు. మొత్తంమీద వైసీపీ నుండి వేమిరెడ్డి నిష్క్రమణ ఆ పార్టీ వర్గాలని నిరుత్సాహపరిస్తే, టీడీపీ శ్రేణులలో జోష్‌ నింపిందని చెప్పవచ్చు. చూద్దాం రాబోయే 75 రోజుల తరువాత ఏం జరగబోతుందో!

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here