Home జిల్లా వార్తలు వీపీఆర్‌ – వీఎస్‌ఆర్‌

వీపీఆర్‌ – వీఎస్‌ఆర్‌

మరో వారంలోగా ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని వార్తలు వస్తున్న తరుణంలో నెల్లూరుజిల్లా రాజకీయ వాతావరణం వేసవికంటే తీవ్రంగా వేడెక్కిపోతోంది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు ‘సేవాభూషణ్‌’ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి తెలుగుదేశంలో చేరడం, ప్రభాకరరెడ్డిపై పోటీకి వైసీపీ అధిష్టానం మరో రాజ్యసభ సభ్యులు నెల్లూరీయులు వేణుంబాక విజయసాయిరెడ్డిని రంగంలో దింపడంతో రాజకీయాలు జోరందుకున్నాయి.
చంద్రబాబునాయుడి సమక్షంలో
టీడీపీలో చేరిన వీపీఆర్‌ దంపతులు
మార్చి 2వ తేదీ నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నెల్లూరుకి వచ్చారు. గొలగమూడి రోడ్డులోని వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ బాబు రాక… వేమిరెడ్డి దంపతులు చేరిక కోసం ముస్తాబైంది. జాతీయ రహదారి నుండి కార్యక్రమ ప్రాంగణం వరకు పసుపు జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో తెలుగుతమ్ముళ్ళు నింపేశారు. సభా వేదిక దగ్గర నుండి కనుపర్తిపాడు కూడలి వరకు మైకులు ఏర్పాటు చేశారు. చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి , ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి పచ్చ కండువాలు కప్పుకున్నారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. తాము తెలుగు దేశం పార్టీలో చేరుతామని బహుశా ఆ దంపతులు కూడా ఊహించి ఉండరేమో. అంతా దైవ నిర్ణయంలా జరిగిపోయిందని వీపీఆర్‌ అనుయాయులు భావిస్తున్నారు.

వైసీపీ పార్లమెంటు అభ్యర్థిగా
నెల్లూరొచ్చిన విజయసాయిరెడ్డి
వైసీపీ అధిష్టానం నెల్లూరు పార్లమెంటు సీటుపై కసరత్తు చేసింది. వీపీఆర్‌ని
ఢీ కొనగల సత్తా, సమర్ధత ఎవరికుందని మల్లగుల్లాలు పడిరది. చివరికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని రంగంలో దింపింది. మార్చి 6వ తేదీన విజయసాయిరెడ్డి నెల్లూరుకి వచ్చారు. వైసీపీ శ్రేణులు కూడా తామేం తక్కువ తిన్నామా అన్నంత రీతిలో సాయిరెడ్డికి ఘనస్వాగతం పలికారు. వందల వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. నగరాన్ని ఫ్లెక్సీలతో, వైసీపీ జెండాలతో నింపేశారు. భారీ నుండి అతి భారీ పూలమాల లతో విజయసాయిరెడ్డిని సత్కరించారు. రామమూర్తినగర్‌లో తన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం సాయిరెడ్డి విలేఖరులతో మాట్లాడారు. తన జన్మభూమి ఋణం తీర్చుకోవడానికి నెల్లూరు నుండి పోటీ చేస్తున్నానని ప్రకటించారు.

సేవకి చిరునామా
వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి
గత ముప్పై సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా సేవారంగంలో తన ఉనికిని చాటు తున్న సేవాభూషణుడు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి. జిల్లాలో ఆయన సాయం అందుకోని అనాధ ఆశ్రమం లేదు. ప్రభుత్వ పాఠశా లలో వసతులు సమకూర్చారు. ప్రభుత్వ బీసీ హాస్టళ్ళ భవనాల పునఃనిర్మాణ కార్యక్ర మాన్ని చేపట్టారు. నెల్లూరు కేంద్ర కారా గారంలో ఖైదీలకు అవసరమైన సౌకర్యా లని ఏర్పాటు చేశారు. జిల్లాలో క్రీడలని ప్రోత్సహించారు. పేదపిల్లలకి కార్పొరేట్‌ విద్య అందించడమే లక్ష్యంగా అత్యాధునిక వసతులతో స్కూలు భవనాన్ని నిర్మించారు. వీపీఆర్‌ విద్య పేరుతో పేదవారికి పూర్తిగా ఉచితంగా విద్యాబోధన చేయిస్తున్నారు. విద్యతో పాటుగా వారికి మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, యూనిఫారం, స్కూలు బ్యాగు, షూస్‌, రవాణా సదు పాయం వంటి వాటి కోసం కూడా వారి వద్దనుండి ఒక్క పైసా ఆశించకుండా మొత్తం
ఉచితంగా అందిస్తున్నారు. అదే ప్రాంగణంలో తన పేరుతోనే వీపీఆర్‌ వైద్యం పేరుతో ఆసుపత్రిని ఏర్పాటు చేసి రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకూ ఆ వైద్యాలయానికి వచ్చే రోగులకు అవసరమైన చికిత్సతో పాటు మందులు కూడా ఉచితంగా అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మారుమూల గ్రామాలలో సైతం 125కి పైగా వాటర్‌ప్లాంట్లని ఏర్పాటుచేసి మంచినీరు అందిస్తున్నారు. సమాజంలో ప్రజలని చైతన్యవంతుల్ని చేసి స్ఫూర్తి కలిగించిన ప్రముఖుల విగ్రహాలు నెలకొల్పడానికి పూర్తి ఆర్ధిక సహాయ సహకారాలు అందించారు. వాగ్గేయకారులు అన్నమాచార్యులు, సుప్రసిద్ధ సంఘ సంస్కర్తలు జ్యోతిరావు పూలే దంపతులు, ఉమ్మడిరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డి, సుప్రసిద్ధ సినీ గాయకులు ఘంటసాల వంటి ప్రముఖుల విగ్రహాలు నెల్లూరులో ఏర్పాటుచేయడానికి ప్రధాన కారకులు ప్రభాకరరెడ్డే. ఈ కార్యక్రమాలన్నిటి కోసం తన పేరుతో వీపిఆర్‌ ఫౌండేషన్‌ని ఏర్పాటు చేశారు.
ఆధ్యాత్మిక సారధి…
ప్రభాకరరెడ్డి చేసిన, చేస్తున్న భక్తి కార్యక్రమాలకి ఆకాశమే హద్దు. జిల్లాలోని అనేక దేవాలయాల జీర్ణోద్ధరణకి ఆయన చేయూతనందించారు. శ్రీ వెంకటేశ్వరస్వామివారి వైభవోత్సవాలను రెండు పర్యాయాలు నెల్లూరులో నిర్వహించి కొన్ని లక్షలమంది భక్తులకు స్వామివారి నిత్య సేవలను తిలకించే అవకాశం కల్పించారు. ప్రతి ఏటా లక్షదీపోత్సవ కార్యక్రమాలని వైభవోపేతంగా జరిపిస్తారు. జిల్లాతో పాటు రాష్ట్రంలో పలు దేవాలయాలలో కుంభాభిషేకాలను కూడా నిర్వహించారు.
మొన్నటివరకు ఆయన అధికార పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్ధిగానే రాజ్యసభలో అడుగుపెట్టారు. ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్లారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. నెల్లూరు నియోజకవర్గ పార్లమెంటు అభ్యర్థిగా ప్రజల ఆశీస్సుల కోసం ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు.
జగన్‌మోహన్‌రెడ్డికి అంతరంగికుడు విజయసాయిరెడ్డి!
నెల్లూరుజిల్లా తాళ్లపూడి విజయసాయిరెడ్డి స్వగ్రామం. వృత్తిరీత్యా ఆయన ఆడిటర్‌. రాజకీయాలని తన ప్రవృత్తిగా మార్చుకుని లెక్కల మాంత్రికుడు కాస్తా రాజకీయ తాంత్రికుడిగా మారారు. రాజశేఖరరెడ్డి హయాం నుండి వై.ఎస్‌. కుటుంబానికి అత్యంత సన్నిహితులు సాయిరెడ్డి. మద్రాసు కేంద్రంగా తన వృత్తి, వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు. డాక్టర్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 2005లో సాయిరెడ్డి తన మకాం హైదరాబాదుకి మార్చారు. ఆ కుటుంబంతో ఆయన అనుబంధం అంతలా ఉండేది. తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డు సభ్యుడిగా రాజశేఖరరెడ్డి సాయిరెడ్డికి రెండుసార్లు అవకాశం కల్పించారు. రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడే సాయిరెడ్డి వై.ఎస్‌. కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డికి బాగా దగ్గరయ్యారు. వ్యాపార వ్యవహారాలలో మార్గదర్శకుడిగా సముచిత సలహాలిస్తూ జగన్‌కి ఆర్ధిక సలహా దారుడిగా అత్యంత ఆంతరంగికుడిగా మారిపోయారు. రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత వీరిద్దరి బంధం మరింత గట్టిపడిరది. జగన్‌పై కక్షతో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో సాయిరెడ్డి కూడా బలయ్యారు. తన కోసం సాయిరెడ్డి చేసిన త్యాగాన్ని జగన్‌మోహన్‌రెడ్డి మరువలేదు. 2016లోనే అంటే వైసీపీ అధికారంలోకి రాకముందే సాయిరెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి పెద్దల సభకి పంపించారు. మే 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సాయిరెడ్డికి అత్యంత ప్రాధాన్యతని కల్పించారు. మళ్ళీ 2022లో కూడా సాయిరెడ్డిని రాజ్యసభకు పంపి రెండవసారి అవకాశం ఇచ్చారు. తన చుట్టూ ఉన్న నలుగురు కీలక వ్యక్తులలో సాయిరెడ్డి కూడా ఒకరన్న సంకేతాన్ని అటు అధికార వర్గాలకి, ఇటు పార్టీ శ్రేణులకు స్పష్టంగా ఇచ్చారు జగన్‌.
ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పార్టీ మారడాన్ని జీర్ణించుకోలేని జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విజయసాయిరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసి విజయం సాధించి తిరిగిరా అంటూ ఆశీర్వదించి పంపించారు. సాయిరెడ్డికి మంచి వాక్చాతుర్యం ఉంది. వ్యవస్థల్ని మానేజ్‌ చేయగలగడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. సామాజిక మాధ్యమాలతో పాటు ఇతర మీడియా సాధనాలను సమర్ధవంతంగా వాడుకోవడంలో ఆయన ధిట్ట.
మొన్నటివరకూ పార్టీ వేదికగా రాజ్యసభ అభ్యర్థులుగా రాజకీయాలు చేసిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి ఇద్దరూ తొలిసారిగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి తలపడబోతున్నారు.
ప్రజాసేవలో మూడు దశాబ్దాలుగా ఉండి జిల్లాలో గుర్తింపు పొందినవారు ఒకరైతే, పార్టీకి విధేయుడిగా, ముఖ్యమంత్రికి అంతరంగికుడిగా, అధికారపార్టీలో కీలకవ్యక్తిగా, అన్నింటినీ మించి నెల్లూరుజిల్లా వాడిగా బరిలో దిగిన వారు రెండవ వారు. ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా ఉన్న వీరిద్దరి పోరులో ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో వేచి చూడాలి!

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here