Home జాతీయ వార్తలు రామరాజ్యం రావాలి

రామరాజ్యం రావాలి

‘దాదాపు అయిదు శతాబ్దాల నాటి కల సాకారమై.. ఎట్టకేలకు అయోధ్య రామమందిరం ప్రారంభం కావడం, ఇనకులసోముడైన ఆ రఘురాముని దివ్వరూపం మేఘవర్ణంలో అపురూపంగా సాక్షాత్కరిస్తూ అయిదేళ్ళ బాలునిగా.. బాల రామునిగా అవతరించి, అత్యద్భుతంగా నిర్మించిన భవ్యమైన ఆలయంలో పద్మపీఠంపై ప్రాణప్రతిష్ట చేసుకోవడం, ఒకచేతిలో స్వర్ణధనుస్సు..మరొకచేతిలో బంగారు బాణం, పసిడికాంతుల పీతాంబరాలతో, ధగధగా మెరిసిపోతున్న వజ్రవైఢూర్యాలు..స్వర్ణాభరణాలు, మణులు, కెంపులు ముత్యాలతో సూర్యదేవుని చిహ్నంతో పొదిగిన కిరీటధారణతో, వజ్ర తిరునామంతో, మహావిష్ణువు అవతారంగా భావిస్తూ బాలరాముని హృదయపీఠంపై కౌస్తుభ మణి అలంకరణతో, స్వర్ణాభరణాల దివ్యాలంకారంతో,.. సుగంధభరిత పుష్పాలంకృతుడై దేదీప్యమానంగా భాసిస్తూ బాలరాముడు అయోధ్యలో అవతరించిన ఘట్టం..అద్భుతం, అపురూపం, చరిత్రాత్మకం. ఆ మహత్కార్యం రామభక్తుడైన ప్రధాని మోడీ చేతులమీదుగా ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా జరగడం ప్రపంచవ్యాప్తంగా భారతీయుల హృదయాలను పులకింపజేసింది. సకలగుణాభి రాముడైన ఆ సాకేతరాముడే అవనిపై తిరిగి అవతరించడంతో హిందువుల మనసులు ఆనందతరంగితమయ్యాయి.
అయోధ్యరామయ్య తిరిగి తన ఇంటికి వచ్చేశాడు. ఆ కమనీయ.. రమణీయ దృశ్యాలను ప్రసార మాధ్యమాల్లో వీక్షిం చిన భక్తకోటి తరించిపోయారు. రామ భక్తులు సగర్వంగా ‘జై శ్రీరామ్‌’ అంటూ ఉప్పొంగిపోయారు. అంతా రామ మయం.. ఈ జగమంతా రామమయం అన్నట్లుగా రామావతరణంతో ప్రపంచానికే నూతనోత్సాహం వచ్చినట్లయింది. ఎట్లయి తేనేం.. ‘రాముడొచ్చాడు.. ఇక రామ రాజ్యం రావాలి.. భవ్యభారత్‌ సాకారం కావాలి.. అన్నదే ఇప్పుడు భారతీయులం దరి మనసుల్లోని ఆకాంక్ష!..
‘రాముడొచ్కాడు..ఇది ప్రపంచ చరిత్ర లోనే ఒక సువర్ణాధ్యాయం. రామ్‌ లల్లా ఇక టెంట్‌లో ఉండాల్సిన పనిలేదు.. అద్భుతమైన ఆలయంలో కొలువైవుండి ప్రజల పూజలందుకుంటాడు’.. అని ప్రధాని మోడీ పరవశం చెందారంటే, అం దుకు ఎంతో నేపథ్యం ఉంది. అయోధ్యలో రామమందిరం స్థాపన వెనుక ఎన్నో కష్ట నష్టాలున్నాయి. దాదాపు అయిదు వందల సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు, మహనీయుల త్యాగాలు, బలిదానాల తర్వాత మళ్ళీ అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగింది. ఎంతోకాలంగా రాముడు ఒక చిన్న టెంట్‌లోనే ఉండే పరి స్థితి నుంచి ఒక దివ్యమైన మందిరంలోకి రావడం ఒక అద్భుతం. జనవరి 22న జరిగిన ఈ చరిత్రాత్మక సన్నివేశం ప్రపంచ ప్రజలను సైతం ఎంతగానో ఆకట్టుకుంది. ప్రధాని మోడీ సారధ్యంలో, రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ నేతృత్వంలో అయోధ్య రామమందిరం అద్వితీయంగా రూపుదిద్దు కోవడం, రాముని విగ్రహ ప్రతిష్ట జరగ డంతో కొత్త శకానికి శ్రీకారం చుట్టి నట్లయింది. దీంతో భారత్‌ భవిష్యత్తు కూడా ఎంతో ఆశావహంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. ఆ ఆకాంక్షలు నెరవేరే దిశగా ప్రధాని మోడీ భవిష్యత్‌ ప్రగతి పథకాలకు సమాయత్తం కావాలని అందరూ ఆశిస్తున్నారు.
రాముడు లోకానికే ఆదర్శం
రాముడు భారతీయుల గుండెల్లో కొలువై ఉన్న దేవుడు. అందుకే రాము డన్నా, రామమందిరమన్నా, రామాయణ మన్నా ఎంతో అభిమానం. దేశంలో సీతా రాముల మందిరాలు లేని ప్రాంతం ఉం డదు. అంతగా ప్రజలు తమ గుండెల్లో గుడికట్టుకుని శ్రీరాముని పూజించుకుంటు న్నారు. ప్రధాని మోడీ అభివర్ణించినట్లుగా ‘రాముడంటే నిప్పు కాదు..శక్తి. రాముడంటే వివాదం కాదు…సమాధానం’. అంతేకాదు, ‘రాముడు ఈ లోకానికే ఆదర్శం. రాముడే భారతీయ విధానం..రాముడే భారతావ నికి ఆత్మ. రాముడే మనదేశపు కీర్తి పతాక.. ఆయనే శాశ్వతం..ఆయనే విశ్వం’ అని అద్భుతంగా ఆయన ఉద్వేగంగా చెప్పారు. ఏదేమైనా ఈనాటికి రామమం దిరం కల సాకారమై, ‘ఆలయ నిర్మాణం పూర్తయింది..ఇక దేశ నిర్మాణం జరగాల్సి ఉంది. వికసిత్‌భారత్‌కు, భవ్యభారత్‌కు అదే స్ఫూర్తితో అడుగులుపడాలి. ఆ మేరకు బృహత్తర కార్యాచరణకు కేంద్రం కంకణం కట్టుకోవాలి. దేశంలో పేదరికం.. అసమా నతలు తొలగిపోయి ప్రజలంతా ప్రగతి ఫలాలు అందుకోవాలని, అభివృద్ధిపథంలో మనదేశం ప్రపంచంలోనే అగ్రగామి పథా నికి చేరుకోవాలని, భారత్‌లో మళ్ళీ రామ రాజ్యం రావాలని ప్రజలంతా మనసా వాచా కోరుకుంటున్నారు.
పర్యాటక ప్రాంతంగా కూడా
అయోధ్య రామాలయానికి నిత్యం సుమారు ఒకటిన్నర లక్షమంది దాకా భక్తజనం వస్తారని, ఏటా కనీసం 5 కోట్ల మంది సందర్శకులు రావచ్చని అంచనా. అయోధ్యలో రామాలయం నిర్మాణంతో పాటు అంతర్జాతీయస్థాయి విమానా శ్రయం, ఆధునికమైన రైల్వేస్టేషన్‌, పెద్దపెద్ద హోటళ్ళు, అతిథిగృహాలు సమస్త సౌక ర్యాలు కలుగజేస్తుండడంతో అయోధ్య ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా కూడా రూపుదిద్దుకుని, తద్వారా భారత పర్యాటక రంగానికి భారీస్థాయిలో ఊతమిస్తుందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here