Home రాష్ట్రీయ వార్తలు మత్తెక్కిస్తున్న మద్యం మాఫియా…. నిషేదానికి ముందే నిషా ..!

మత్తెక్కిస్తున్న మద్యం మాఫియా…. నిషేదానికి ముందే నిషా ..!

“ఆంధ్రా, తెలంగాణా సరిహద్దు జగ్గయ్యపేట వద్ద గ్యాస్ సిలిండర్ లో 100 సీసాల అక్రమ మద్యం పట్టివేత ”
“కర్ణాటక, ఆంధ్రా సరిహద్దు పలమనేరు వద్ద లారీ లో వడ్లపొట్టు లోడు కింద 25 కేసుల విస్కీ లభ్యం ”

“ఆంధ్రా తమిళనాడు బోర్డర్ తడవద్ద కూరగాయల ఆటోలో భారీస్థాయిలో అక్రమ మందు ”

” ఒడిస్సా , ఆంధ్రా సరిహద్దు ఇచ్ఛాపురం వద్ద బట్టల మధ్యలో గుట్టలగుట్టల మద్యం ”

ఆంధ్రా , ఛత్తీస్ ఘడ్ బోర్డర్ లోని చింతూరు దగ్గర కారు బానెట్లో జోరుగా మద్యం తరలింపు ”

ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సరిహద్దుల్లో కో కొల్లలు జరుగుతున్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రాష్ట్రంలో విచ్చలవిడిగా, ఏరులై పారుతోంది. ఖచ్చితంగా చెప్పాలంటే రాష్ట్రంలోని మద్యం డిపో లలో ఉన్న స్టాక్ కి పదింతలు, అక్షరాలా అంతకు మించి ఇతర రాష్టాల మద్యం రాష్ట్రంలో అందుబాటులో ఉంది. ఒక్క స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పై స్థాయి లో కొందరు అధికారులకు తప్ప ఈ విషయం అందరకీ తెలుసు, అయినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఎస్ ఈ బీ అధికారులు.

దశాలవారీ మధ్య నిషేధం తో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత ఆశయం, లక్ష్యం తో దశల వారీ మద్య నిషేధానికి నడుం బిగించింది. తన సుదీర్ఘ పాదయాత్రలో అప్పటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యం వల్ల ఇల్లు గుల్లయి, పిల్లలను చదివించలేక, అనారోగ్యాలు పాలై, చివరకు తాగి తాగి భర్తలు చనిపోతే విధవులు గా మారిన ఆడబిడ్డల అవస్థలు చూడలేక ఈ మహమ్మారిని శాశ్వతంగా రాష్టం నుంచి దూరం చేయాలని దశల వారీ మధ్య నిషేధానికి నడుం బిగించారు. అందులో భాగంగా ధరల పెంపు తో పాటు మొదటి ఏడాది లో నే దాదాపు 40 శాతం మద్యం దుకాణాల సంఖ్యను కూడా కుదించారు. ధర పెంచడం, అందుబాటులో లేకుండా చేయడం ద్వారా మద్యపాన ప్రియుల్లో దానిపట్ల ఆసక్తిని తగ్గించడం, ఒక రకంగా ఏహ్యభావాన్ని పెంపొందించడం, 5 ఏళ్ల తర్వాత పూర్తిగా వాటిల్ని తొలగించడం ప్రభుత్వ ఉద్దేశం. కానీ మనం ఒకటి ఆలోచిస్తే దైవం ఒకటి ఆలోచిస్తుంది అన్నట్లు, ప్రభుత్వ ఉద్దేశం ఒకటైతే ఆ అలవాటును మానలేని మద్యం ప్రియుల, వాళ్ళ బలహీనతలపై వ్యాపారం చేసే మద్యం అక్రమ రవాణా దార్లు, వాళ్ళ నుంచి లాభపడే కొందరి అధికారుల ఆలోచన వేరే లా ఉంది. ఇదేదో అందివచ్చిన అవకాశం గా భావించిన ఈ ముఠా రాష్ట్ర ఆదాయాన్ని గండి కొట్టే విధంగా ఇతర రాష్టాలలో పన్ను చెల్లించి చేస్తోన్న అక్రమ రవాణా అసలుకే ఎసురు తెచ్చేలా, నిషేధానికి ముందే నిషా లా, భవిష్యత్ లో ఇంకెలా ఉండబోతోందో చెప్పేందుకు సంకేతంలా తయారైంది.

*ధరల పెంపే ప్రధాన కారణమా?

ఇతర రాష్ట్రాల మద్యం కి రాష్ట్రంలో ఎందుకు ఇంత డిమాండ్ ఉంది? ఎక్కడికక్కడ ఎస్ ఈ బీ, స్థానిక పోలీస్ లు కలిసి తనిఖీ లు చేస్తున్నా ఎందుకు అక్రమ రవాణాకు స్మగ్లర్లు రిస్క్ చేస్తున్నారు అంటే… ప్రధాన కారణం ధరల పెంపే అని వినిపిస్తోంది. మద్యాన్ని పేదలకు అందుబాటులో ఉంచకుండా ఉండేందుకు ప్రభుత్వం ధరలను భారీ ఎత్తున పెంచింది. 70 శాతం వరకు ధరలు పెంచినా మద్యప్రియులు అప్పులు చేసో, లేదంటే తాము పనిచేయగా వచ్చిన మొత్తాన్ని వెచ్చించో, లేదంటే ఆ క్వార్టర్ మద్యం కోసమే పని చేయడమొ ప్రారంభించారు. ఇలాంటి సమయాల్లో మన రాష్టంలోని ధరలతో పోలిస్తే ఇతర రాష్ట్రాల్లో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉండడంతో సహజంగానే వాటి వ్యాపారం పై కొందరు దృష్టి సారించారు. చివరకి రాజకీయ నాయకులు కూడా ఈ వ్యవహారాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలోనే గుంటూరు లో బీజేపీ కి చెందిన రాష్ట్ర కార్యదర్శి ఏకంగా ఈ అక్రమ మద్యాన్ని తరలిస్తూనే పట్టుబడ్డ విషయం అందరికి తెలిసిందే. ఒక్క బీజేపీ నే అనేకాదు, దాదాపు అన్ని పార్టీల నేతలు ఇందులో భాగస్వామ్యులుగా ఉండి, కొంతమంది అమాయక జనాల్ని ఇందులో దింపి వాళ్ళ చేత ఈ వ్యాపారాలను చేయిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విధంగా రాష్టాల్లో చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ కనీస ధర 200 కాగా బయట రాష్ట్రాల నుంచి తెచ్చిన ఇంతకంటే మెరుగైన మద్యం కేవలం 100 రూపాయలకే అందుబాటులో ఉంటుండడం తో మద్యం ప్రియులు వీటిపైనే ఆసక్తి చూపిస్తున్నారు. రాష్టంలో అందుబాటులో ఉండే మందు ధరకు ఇతర రాష్టాల్లోని మందు సగం ధరకే లభించడం తో దానికి విపరీతమైన డిమాండ్ రావడంతో ఇక దాని అక్రమ రవాణా విస్తృoఖలత్వాన్ని దాల్చింది.

బ్రాండ్స్ అందుబాటులో లేకపోవడమూ కారణమే

ధర లో భారీ వ్యత్యాసం తో పాటు గుర్తింపు పొందిన బ్రాండ్స్ అందుబాటులో లేకపోవడమూ మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం లభ్యమవుతోన్న బ్రాండ్స్ అన్నీ రాష్ట్ర ప్రజలకు కొత్తగా పరిచయం అవుతోన్న పేర్లే. ప్రెసిడెంట్ మెడల్, బ్లాక్ బస్టర్, స్పై హెచ్ డీ, బూమ్, కోల్ట్… ఇలా పెద్దగా పరిచయం లేని బ్రాండ్స్ కూడా కాకపోవడం అక్రమ రవాణాకు మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది. సాధారణంగా మద్యం దుకాణాల్లోకి వెళ్తే వినిపించే పేర్లు కింగ్ ఫిషర్, బడ్వైజర్, కాల్స్ బర్గ్, హేన్ కిన్, మేక్డో వెల్స్ , బ్లెండర్స్ ప్రైడ్, రాయల్ స్టాగ్, మాన్షన్ హౌస్, ఆఫీసర్స్ ఛాయిస్ లాంటివి. కానీ ఇప్పుడు వాటికి భిన్నమైన బ్రాండ్స్, గతంలో మనం ఎప్పుడూ వినని బ్రాండ్స్ కూడా కాకపోవడంతో పాటు వాటి పేర్లు కూడా గుర్తు పెట్టుకోలేని మద్యం ప్రియులు 200 రూపాయల క్వార్టర్ బాటిల్, 250 రూపాయల బాటిల్.. ఇలా అడుగుతుండడం విశేషం.

వీటితో పాటు 100 పైపర్స్, బ్లాక్ డాగ్, చివాస్ రీగల్ , జానీ వాకర్ లాంటి ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఇక్కడ అందుబాటులో ఉంటున్నా అవి కేవలం డిపోల కి మాత్రమే పరిమితం చేస్తూ వాటిని కూడా టార్గెటెడ్ కస్టమర్లకు మాత్రమే అందిస్తున్నారని, బహిరంగ మార్కెట్ లో వాటి లభ్యత లేకుండా చేస్తున్నారన్న విమర్శలూ ఎక్కువ వినిపిస్తున్నాయి. వీటన్నింటి వల్ల మందు బాబులు ఇతర రాష్ట్రాల మద్యం వైపు దృష్టి సారిస్తున్నట్టు సమాచారం.

రాష్ట్రానికి నష్టం నెలకు 1000 కోట్ల పైనే

గత ఏడాది తో పోలిస్తే రాష్టంలో ఇటీవలి కాలంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఆదాయం కూడా అంతే స్థాయిలో పడిపోయింది. దీనితో నెలకి కనీసం 1000 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు తెలిపారు., ఆ మేర ఇతర రాష్ట్రాల మద్యం అమ్ముడుపోతోందని, రాష్ట్రం చుట్టూ ఉన్న సరిహద్దు రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ ల నుంచి అనేక మార్గాల్లో మద్యం వస్తోందని, ఏఏ మార్గాల్లో వస్తుందో ఇంకా ఎస్ ఈ బీ కె తెలియదన్నది ఆ అధికారి వివరణ.

411 జీ ఓ ని సవరిస్తారా? రద్దు చేస్తారా?

ఇలాంటి పరిస్థితుల్లో హై కోర్ట్ తాజాగా ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని మరింత దెబ్బ కొట్టేలా ఉంది. వ్యక్తిగత వినియోగం కోసం ప్రతీ ఒక్కరూ కనీసం మూడు లీటర్ల మద్యాన్ని తమతో తరలించడం కానీ, ఇంటి వద్ద స్టాక్ చేస్కోవడం కానీ చేయవచ్చన్నది 411 జీ ఓ ముఖ్య ఉద్దేశం. కానీ ఈ జీ ఓ లో ఆ మద్యం రాష్టంలోని మద్యం దుకాణాల్లో విక్రయించిందే అని స్పష్టం చేయకపోవడం తో ఇప్పుడు చిక్కు వచ్చి పడింది. ఇటీవలి కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క క్వార్టర్ బాటిల్ తెచ్చినా ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకుంటోంది. ఆ బాటిల్స్ కలిగి ఉన్న వాహనాన్ని సీజ్ చేయడం తో పాటు, ఆ వాహనంలో ని వ్యక్తులపైనా కేసులు నమోదు చేస్తున్నారు. ఆ వాహనాల్లో మహిళలు పిల్లలు ఉన్నా వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ సైతం వెతికే ప్రయత్నం చేస్తోన్న పోలీస్ కి హై కోర్ట్ తాజా నిర్ణయం షాక్ ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నా సరే మూడు బాటిల్స్ ఉండొచ్చు అన్నది హైకోర్టు తాజా తీర్పు. ఆ తీర్పు వచ్చేందుకు వేసిన పిటిషన్ కూడా తెలంగాణ నుంచి మూడు బాటిల్స్ తెచ్చుకుంటుంటే వాహనాన్ని సీజ్ చేశారని పిటిషనర్ హైకోర్టు లో వేసిన పిల్లే కారణం. దీంతో ఇప్పుడు 411 జీ ఓ ని సవరిస్తూ రాష్టంలో విక్రయించే మద్యానికి మాత్రమే పరిమితం చేయడమా, లేక ఆ జీ ఓ ని రద్దు చేయడమో చేయాల్సిన అవసరం ఉంది.

మొత్తానికి ఇలా మద్య నిషేధానికి ముందే రాష్ట్రాన్ని ఇతర రాష్ట్ర మద్యం తో నిషా లోకి నింపుతోన్న అక్రమ రవాణా దారులు ఇక నిషేధం ప్రారంభం అయితే ఏ స్థాయిలో చెలరేగబోతున్నారో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అవినీతి పై ఉక్కుపాదం మోపుతోన్న సమయంలో అంది వచ్చిన అవకాశంగా కొంతమంది అధికారులకు బంగారు బాతు గా మారిన ఈ అక్రమ రవాణా ఇక భవిష్యత్ లో శాశ్వతంగా ఉండబోతోందన్న విషయం మరింత కిక్కెక్కించనుంది.

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here