Home సింహపురి సమాచారం నేరపురిగా మారుతున్న సింహపురి… నగరంలో రెచ్చిపోతున్న రౌడీమూకలు

నేరపురిగా మారుతున్న సింహపురి… నగరంలో రెచ్చిపోతున్న రౌడీమూకలు

నెల్లూరు నగరంలో పెరుగుతున్న జనాభాతో పాటుగా నేరాల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. చెడు తిరుగుళ్లకు, దుర్వ్యసనాలకూ అలవాటుపడిన యువత, పెడదారి పడుతోంది. తమ అలవాట్లకు, వ్యసనాలకు అవసరమైన డబ్బుల కోసం చిన్నవి నుండి పెద్దవి వరకు ఎలాంటి నేరాలను చేయడం కోసమైనా ఈ ముఠాలు సిద్ధపడుతున్నాయి. ముఖ్యంగా నగర శివార్లలోని చీకటి ప్రాంతాలను తమ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుని కార్యకలాపాలను సాగిస్తున్నారు. 1984 -85 తరువాత దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు నెల్లూరులో రౌడీయిజం, గుండాయిజంతో పాటు అసాంఘిక కార్యకలాపాలన్నవే కనిపించకుండాపోయాయి. అంతకుముందు ప్రధానంగా కపాడిపాలెం, చాకలివీధి, కామాటివీధి, వెంకటేశ్వరపురం, కొత్తరోడ్డు, జెండావీధి, ఫతేఖాన్‌పేట వంటి ప్రాంతాలతో పాటు నగరంలో మరికొన్ని ప్రాంతాలు చిల్లరరౌడీలతో, అల్లరిమూకలతో, దౌర్జన్యాలతో, వ్యక్తిగత దాడులతో, ముఠా తగాదాలతో నిత్యం వార్తలలో ఉండేవి. 1983లో తెలుగుదేశం అధికార పగ్గాలు చేపట్టిన కొంత కాలానికి అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు ప్రధానంగా ఈ న్యూసెన్స్‌ గ్యాంగులపై దృష్టి పెట్టారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అరాచక ముఠాలకు వణుకు పుట్టించారు. కొన్నిచోట్ల ఎన్‌కౌంటర్లు కూడా చేయించి కరడుకట్టిన కసాయి మూకను తుదముట్టించారు కూడా. మాటవినని వారికి, మార్పు రానివారికీ ఈ ఎన్‌కౌంటర్లు ఒక హెచ్చరిక అన్నట్లుగా సంకేతమిచ్చారు. అప్పట్లో ప్రభుత్వ విధానాలతో హడలిపోయిన చాలామంది ముదురురౌడీలు అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు. నెల్లూరులో కూడా అప్పట్లో పోలీసులు తమ సత్తా చూపించారు. జులపాలు పెంచుకుని తిరిగిన వారిని సైతం మోకాళ్ళమీద కూర్చోబెట్టి ‘సీకేచర్‌’ (మొక్కలు కత్తిరించే కత్తెర)తో జుట్టు కత్తిరింపచేసేవారు. ఆ తరువాతి తరాల వారు ఆ విష సంస్కృతిని పూర్తిగా మర్చిపోయేలా నిర్ములించారు.
నయాతరం రాజకీయ నాయకుల పుణ్యం, వారి చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన పోలీసు అధికారుల నిస్సహాయత కారణంగా క్రమేణా నగరంలో మళ్ళీ పాత సంస్కృతి వేళ్లూనుకుంటోంది. రాత్రయితే నగర శివార్లలోని మరుగు ప్రాంతంలో మద్యం సేవించడం, గంజాయి, డ్రగ్స్‌ వాడడం, బహిరంగ ప్రదేశాల్లోనే వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. డబ్బు సంపాదన కోసం క్రికెట్‌ బెట్టింగులు, సింగిల్‌ నంబర్‌ పందేలు, చైన్‌స్నాచింగులు, చిల్లర దొంగతనాలు పుట్టుకొస్తున్నాయి. గొడవలు, దాడులు, కొట్లాటల గ్యాంగులు రెచ్చి పోతున్నాయి. రాత్రి వేళల్లో ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనే వాళ్ళే తెల్లారితే ప్రజా ప్రతినిధుల కార్యాలయాల్లోనూ, ఇళ్ల కాంపౌండ్లలోనూ దర్శనమిస్తున్నారు. ఇదే పరిస్థితి మరి కొన్నాళ్లు కొనసాగితే రానున్న రోజుల్లో సింహపురి ‘నేరపురి’గా మారడం ఖాయమన్న అభిప్రాయం ప్రజలనుండి వ్యక్తమవుతోంది.

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here