Home జాతీయ వార్తలు జై శ్రీరామ్‌

జై శ్రీరామ్‌

జనవరి 22… భారతదేశంలో మహోన్నతమైన ఉజ్వలఘట్టం అవిష్కృతమయ్యే రోజు. భారతీయుల శతాబ్దాలనాటి కల… ఫలించే రోజు. దేశవ్యాప్తంగా ‘జై శ్రీరామ్‌’ అంటూ రామనామం మారుమ్రోగే రోజు. ప్రతి ఇంటా రామజ్యోతులు వెలిగే దివ్యమైన రోజు. అయోధ్యతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజమంతా రామభక్తితో పరవశించే రోజు. ప్రత్యేకించి రామభక్తుల గుండెలు పులకించే రోజు. కనీవినీ ఎరుగనివిధంగా అయోధ్యలోని రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహానికి అత్యంత వైభవంగా ప్రాణప్రతిష్ట జరిగే ఆ శుభ ఘడియలకు ముహూర్తం సమీపిస్తుండడంతో దేశప్రజలు ఆనందసందోహంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రుడే తిరిగి అవతరిస్తున్నాడన్న సంబరం భక్తజనంలో పరవళ్లుతొక్కుతోంది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట ప్రధానకర్త.. ప్రధాని మోడీ సారధ్యంలో, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నేతృత్వంలో జనవరి 22వ తేదీ మధ్యాహ్నం జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకించి తరించేందుకు కోట్లాదిమంది ప్రజలు ఉవ్విళ్ళూరుతున్నారు.
శ్రీరామచంద్రుడంటే సాక్షాత్తూ భగవంతుడే. దేవుడే మానవుడుగా అవతరిస్తే.. ఆయనే రాముడు. ఆ రాముడే దేవుడు. అందుకే ఆ దేవదేవుడు జన్మించిన అయోధ్య మానవాళికి ముక్తిని ప్రసాదించే క్షేత్రాల్లో అగ్రగామిగా ఉందని వేనవేల ఏళ్ళనాటి మన పురాణాలు పేర్కొంటున్నాయి. యుగాలు గడిచిపోయినా.. శ్రీరాముడుని, సీతమ్మ తల్లిని ఎవరూ మరచిపోలేదు. రాముని దివ్యచరిత్రను లోకానికి తెలియజేస్తూ వాల్మీకి మహర్షి రచించిన ‘రామాయణం’ గురించి తెలియని వారెవరు? అనేకభాషల్లోనూ ‘రామాయణం’ ఉంది. శ్రీరాముడు జన్మించిన నేల మనది..ఇంతకంటే భారతీయులకి గర్వకారణమైన విషయం ఏముంటుందీ!.. అయినా, రాముని చరిత అంతా కష్టాల మయమే. రాజ్యాన్ని వీడి అడవుల పాలుకావడం, ధర్మపత్ని సీతమ్మ అపహరణకు గురవడం, హనుమంతుడు తదితరులతో కలసి రాముడు సీతమ్మను చెరపట్టిన రావణుడిపై యుద్ధం చేసి తిరిగి సీతమ్మను చేపట్టి పట్టాభిషిక్తుడు కావడం, నాటికాలంలోనే ‘రామరాజ్యం’ స్థాపించి ప్రజలకు జనరంజకమైన పాలన అందించడం దాకా..వాటి వెనకాల రాముడు పడిన కష్టాలు లెక్కలేనన్ని. ఆ తర్వాత యుగాల్లో పరిస్థితి తెలియదు కానీ, ఇటీవలి కాలంలోనూ రాముడికి కష్టాలే. రాముడు పుట్టిన అయోధ్యలో రాముడికి ఒక ఇల్లంటూ లేకపోవడం, ఉన్న ఒక్క ఆలయం అయిదు దశాబ్దాల క్రితం అనేక దౌష్ట్ల్యాలకు గురవడం, ఆ రామమందిరం కోసం ఏళ్ళతరబడి జరిగిన సమరాల్లో లక్షలాది మంది రామభక్తులు ప్రాణాలను సైతం కోల్పోవడం.. ఇదంతా గత చరిత్ర. ఏదేమైనా, పరమపవిత్రమైన దేవభూమిగా పేరొంది విశ్వవ్యాప్తంగా ఆధ్యాత్మిక దివ్య జ్యోతులను ప్రకాశింపజేసే మన దేవాలయాల్లో అత్యంత భవ్యమైనది.. అయోధ్య రామాలయం. కాలగతిలో శతాబ్దాల తరబడి ఎన్నో ఒడిదుడుకులకు, విధ్వంసాలకు గురైనప్పటికీ, అన్ని అవరోధాలను దాటుకుని..భారతీయ వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచింది అయోధ్య రామాలయం. అందుకే అయోధ్య అన్నా, రాముడన్నా ప్రజలకు అంత భక్తి.
అయోధ్య రామాలయం..అపూర్వం :
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రధాని మోడీ సారధ్యంలో, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నేతృత్వంలో తాజాగా నిర్మితమైన రామమందిరం నిర్మాణమే ఒక అద్భుతం. లెక్కలేనన్ని ప్రత్యేకతలకు ఇది నిలయం. ఎటుచూసినా ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా సర్వాంగసుందరమైన కట్టడాలు, శిల్పాలు నయనానందకరం గావిస్తాయి. నాగర్‌శైలి ఆలయ సంప్రదాయంలో గుర్జర`చాళుక్కుల శిల్పకళారీతిని పోలి ఉండేవిధంగా ఆలయాన్ని నిర్మించారు. మూడంతస్తుల్లో 392 స్తంభాలు, 44 ద్వారాలు`తలుపులతో నిర్మించిన ఈ ఆలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161అడుగులు ఉంటాయి. 732 మీటర్ల ప్రహరీ నిర్మించారు. ప్రధాన గర్భగుడిలో బాలశ్రీరాముని రూపం, తొలి అంతస్తులో శ్రీరాముని దర్బార్‌తో పాటు కనువిందుచేసే అయిదు మండపాలు ఉంటాయి. బాలరాముని విగ్రహంతోపాటు 1949లో రామజన్మస్థలంలో లభించిన అపూర్వమైన శ్రీరాముని రూపం.. అప్పట్లో చిన్న గుడారంలో ఉండేది. ఆ విరాట్‌స్వరూపం ఇప్పుడు అత్యంత ఘనమైన శ్రీరామచంద్రుని స్వరూపంగా విరాజిల్లబో తోంది. నాలుగు మూలల్లో నాలుగు మందిరాలు..సూర్యదేవుడు, భగవతీదేవి, విఘ్నేశ్వరుడు, పరమశివుని ఆలయాలతో పాటు ఉత్తరం వైపున మాతా అన్నపూర్ణ ఆలయం, దక్షిణాన హనుమాన్‌ దేవాలయం ఉంటాయి.
2500 ఏళ్ళు చెక్కు చెదరని ఆలయం
అయోధ్య రామాలయాన్ని దాదాపు 2,500 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా అద్వితీయమైన నైపుణ్యంతో నిర్మిం చడం, ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రతి ఇటుకపై ‘శ్రీరామ’ నామం లిఖించి ఉండడం విశేషం. నేపాల్‌లోని గండకీ నదినుంచి వెలికితీసిన..సుమారు ఆరు కోట్ల ఏళ్ళనాటి అత్యంత విశిష్టమైన సాలగ్రామ శిలలతో సీతారామచంద్రుల విగ్రహాలను రూపుదిద్దడం.. అద్వితీయం. రామాలయం సము దాయంలో బంగారుపూతతో కూడిన 14 గేట్లు అమర్చడంతో ఆలయమంతా స్వర్ణకాంతులు వెదజల్లినట్లుగా ఉంటుంది. ప్రధాన ఆలయానికి సమీపంలో ‘సీతా కూపం’ పేరుతో ఉన్న పురాతనమైన బావిని కూడా పునరుద్ధరించారు. రామాయణంతో రాముని ఖ్యాతిని లోకానికి చాటిన ఆదికవి వాల్మీకి మహర్షి, ఇంకా వశిష్ట, విశ్వామిత్ర, వ్యాసమహర్షి తదితరుల ఆలయాలు కూడా నిర్మించారు. రాముని చరిత్రను తెలిపే కుఢ్యచిత్రాలను గోడలపై తీర్చిదిద్దారు. రామజన్మభూమి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకులు, శతాబ్దాల తరబడి ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖుల చిత్రాలను సేకరించి అయోధ్యనగరంలోని గోడలపై చిత్రీకరిస్తున్నారు. యాత్రికుల కోసం దాదాపు పాతిక వేలమందికి సరిపోయే విధంగా ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే అయోధ్య నుంచి శ్రీరామాక్షతలు దేశంలో ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం జరగడం, అది కూడా ఒక చరిత్రాత్మకమైన నిర్మాణంగా తీర్చిదిద్దడం భారతావనికే గర్వకారణం. దేశంలోని ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఆలయానికి అన్ని విధాలా తమవంతు సహకరించి, సేవలందించి తద్వారా తమ జీవితాలను ధన్యం చేసుకోవడం, అన్నిటికీ మించి రాముడికి గుడికట్టించిన నేతగా మోడీ అందరి ప్రశంసలందుఉంటున్నారు. అంతేకాదు, దేశానికి శాశ్వతమైన కీర్తిచంద్రికలు లభించేలా రామాలయాన్ని నిర్మిస్తున్న రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌వారి అకుంఠిత సేవలు ఈ సందర్భంగా వేనోళ్ళ ప్రస్తుతించదగినవి.
32 ఏళ్ళ నాటి ప్రతిజ్ఞ.. ఇప్పటికి నెరవేరుతోంది
దాదాపు 32 ఏళ్ళ క్రితం దేశంలో ఐక్యతా సందేశాన్ని వ్యాప్తిచేయాలనే ధ్యేయంతో బిజెపి నాటి అగ్రనేత మురళీమనోహర్‌ జోషి 1991లో ‘ఏక్తాయాత్ర’ పేరుతో కన్యా కుమారి నుంచి కశ్మీరం దాకా చేపట్టిన యాత్ర 1992 జనవరి 14న అయోధ్యకు చేరుకుంది. ఆ ఏక్తాయాత్రకు పర్యవేక్షకుడిగా ఉన్న నాటి బీజేపీ కార్యకర్తగా ఉన్న నేటి ప్రధాని నరేంద్రమోడీ, ‘రామమందిరం నిర్మించిన తర్వాతనే ఇక్కడకి తిరిగివస్తానంటూ’.. జై శ్రీరామ్‌ నినాదాల మధ్య భీషణ ప్రతిజ్ఞ చేశారు. మోడీ ప్రధాని అయ్యాక రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరగడం, ఇప్పుడు కూడా మోడీయే 11 రోజుల దీక్ష చేపట్టి ప్రధానకర్తగా రామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా నెరవేరుస్తుండడం విశేషం. దీంతో 32 ఏళ్ళనాటి ప్రతిజ్ఞ ఇప్పటికి నెరవేరుతోందన్నమాట!…
మరో విశేషమేమంటే, 2019లో అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సుప్రీం కోర్టు అనుమతించడంతో ఆనాటి నుంచి రామమందిర నిర్మాణానికి కృషి ప్రారంభమైతే, ఆలయ నిర్మాణానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు పన్నెండున్నర కోట్ల మంది భక్తుల నుంచి సుమారు 3500 కోట్ల రూపాయల విరాళాలుగా వచ్చాయంటే రాముని పట్ల ప్రజలకు ఉన్న భక్తి ఎంత గాఢమైనదో ఊహించుకోవచ్చు. ఇక్కడ మరో విషయం.. రామజన్మభూమి ఉద్యమాల్లో కీలకపాత్ర పోషిం చిన బీజీపీ సీనియర్‌ నేతలు అద్వాని, మురళీమనోహర్‌జోషిలకు రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందినా, వారు కారణాంతరాల వల్ల రాలేకపోతున్నారని అంటున్నా, కురువృద్ధుడైన అద్వానీజీ వచ్చే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు భావిస్తు న్నాయి. ఈ సందర్భంగా ‘ఆ శ్రీరామచంద్రుడే ఆలయాన్ని మోడీ ద్వారా కట్టించుకున్నారు’ అంటూ అద్వానీ కితాబివ్వడం విశేషం.

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here