Home జిల్లా వార్తలు ఉత్కంఠ – ఉత్సాహం

ఉత్కంఠ – ఉత్సాహం

ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ జిల్లాలోని రాజకీయవర్గాలు, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న మేధావులు, సామాన్య ప్రజలు… పై ప్రశ్న లన్నిటికీ సమాధానాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’’ అప్పట్లో… అంటే 2015లో బాహుబలి సినిమా మొదటి భాగం చూసిన ప్రేక్షకులు వేసుకున్న ప్రశ్న ఇది. ఆ ప్రశ్నకి రెండేళ్ల తరువాత అంటే 2017లో ఆ చిత్రం రెండవ భాగం వచ్చేవరకూ సమాధానం లభించలేదు. ఇప్పుడు అంతకి మించిన సస్పెన్స్‌తో కూడిన ఉత్కంఠ వాతావరణం నెల్లూరుజిల్లా రాజకీయాలలో కొనసాగుతోంది. నోటిఫికేషన్‌ వచ్చేసి అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించి బి`ఫారాలు ఇచ్చేసినా, వాళ్ళ నామినేషన్ల ఘట్టం ముగిసే వరకూ కూడా పై ప్రశ్నలన్నిటికీ వందశాతం సమాధానాలు లభించే అవకాశమే లేదు. అప్పటివరకూ ఈ రసవత్తర రాజకీయ డ్రామా కొనసాగుతూనే ఉం టుంది. కేవలం… పై ప్రశ్నలే కాకుండా ఇంకా రకరకాల అనుమానాలు, అపోహలు సామాజిక మాధ్యమాలతో పాటు రాజకీయవర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక్క జిల్లా వంద ప్రశ్నలు అన్నట్లుగా ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది.
వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఏ పార్టీలో చేరతారు?
అందరూ భావించినట్లుగానే వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీని వీడారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరతారు? ప్రస్తుతం రాజకీయవర్గాలలో నడుస్తున్న చర్చ ఇది. తన రాజీనామాని ప్రకటించారే తప్ప భవిష్యత్‌ కార్యాచరణాన్ని వెల్లడిరచ లేదు. ఇప్పటికే ఆయన చంద్రబాబుని కలుసుకున్నారు. నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా టీడీపీ నుండి పోటీచేయడానికి సుముఖత చూపించారు అన్న వార్తలు వినపడుతున్నాయి. అయితే, ప్రభాకరరెడ్డి ఆప్తులు చాలామందికి ఆయన టీడీపీకి వెళ్లడం నచ్చడం లేదు. నిన్నటివరకు ముఖ్యమంత్రితో ఒకే టేబుల్‌ పైన కూర్చుని భోజనం చేయగలిగిన స్థాయి ఉన్న వేమిరెడ్డికి టీడీపీలో ఆ స్థాయి విలువ ఉంటుందా…? అన్నది ఆయన అభిమానుల అనుమానం.
అదే బీజేపీ అయితే జాతీయస్థాయి నాయకుడిగా ఎదగొచ్చన్నది వారి అభిప్రాయం. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో మళ్ళీ ఖచ్చితంగా రాబోయేది బీజేపీ అన్న మాట దేశమంతా వినపడుతోంది. అధికారంలో ఉండే జాతీయపార్టీలో ఉంటే ఆ స్థాయి, హుందాతనం వేరే అన్నది వారి భావన.
ప్రత్యక్ష రాజకీయాల నుండి విరమించిన ముప్పవరపు వెంకయ్యనాయుడి పరంపరని కొనసాగించగలిగిన సత్తా, సమర్ధత వీపీఆర్‌ ఒక్కరికే ఉన్నాయన్నది మేధావుల అభిప్రాయం. చూడాలి మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో, ఎవరి సలహాని పాటిస్తారో?
నెల్లూరు పార్లమెంటుకి
వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఎవరు?
క్షణక్షణం మారుతున్న రాజకీయ సమీకరణలతో అన్ని పార్టీల కార్యకర్తలు అయోమయంలో పడిపో యారు. నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పోటీచేస్తే వైసీపీ అభ్యర్థి ఎవరు? విజయ సాయిరెడ్డి అల్లుడి అన్న పెనాక శరత్‌చంద్రారెడ్డి బరిలో ఉండబోతున్నారని వార్తలు వచ్చాయి. తాము వచ్చే ప్రసక్తే లేదని ఆ కుటుంబ సభ్యులు తమ సన్నిహితుల దగ్గర చెప్తున్నారు. ఒకవేళ వేమిరెడ్డి మనసు మార్చుకుని బీజేపీ వైపు మొగ్గుచూపితే కూడా నెల్లూరు పార్లమెంటు రెండుపార్టీల అభ్యర్థులపై సందిగ్ధం ఏర్పడుతుందని విశ్లేషకులు అంటున్నారు.
నగరంలో పోటీ చేసేది
నారాయణా లేక జనసేన అభ్యర్ధా?
ఈసారి నగరంలో నారాయణ గెలుపు ఖాయం అన్న మాట చాలా రోజులుగా వినపడుతోంది. అయితే, జనసేన – టీడీపీ పొత్తు క్రమంలో నగరం జనసేనకు కేటాయిస్తారని ఆ పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. అదే జరిగితే నగరంలో చెన్నారెడ్డి మను క్రాంత్‌రెడ్డి అభ్యర్థి అయ్యే ఛాన్సు కూడా లేకపో లేదంటున్నారు.
నగర వైసీపీ అభ్యర్థి ఖలీలా..
సినీ నటుడు ఆలీనా?
నగర అసెంబ్లీ అభ్యర్థిగా ఖలీల్‌ పేరు ప్రకటించి నప్పటి నుండి వైసీపీలో సర్వత్రా అసంతృప్తి వ్యక్తమ యింది. నారాయణతో ఢీ కొనగల స్థాయి ఖలీల్‌కి లేదని వైసీపీ వర్గాలే బాహాటంగా మాట్లాడుకుంటు న్నాయి. నిఘావర్గాల ద్వారా సమాచారం తెప్పించు కున్న పార్టీ అధిష్టానం, నగర అభ్యర్థి విషయమై పునః పరిశీలిస్తోందని అంటున్నారు. ఖలీల్‌కి బదులుగా సినీ నటుడు అలీని బరిలో దింపుతారని తాజా సమాచారం.
ఆనం రామనారాయణరెడ్డికి
ఆత్మకూరా… వెంకటగిరా?
ఆత్మకూరు దేశం అభ్యర్థిగా ఆనం రామనారా యణరెడ్డి పేరు దాదాపుగా ఖాయమైపోయిందని టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. అయితే, ఆయన మాత్రం తనకి వెంకటగిరే కావాలని మొండికేస్తున్నారని అంటున్నారు. అక్కడ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న కురుగొండ్ల రామకృష్ణని కాదని రామనారాయణకి సీటు కేటాయిస్తారా? అన్నది కూడా మిలియన్‌ డాలర్ల ప్రశ్న.
సర్వేపల్లిలో దేశం అభ్యర్థిగా
మళ్ళీ సోమిరెడ్డే పోటీచేస్తారా?
గత ఏడాది జరిగిన మహానాడులో ఎక్కువసార్లు ఓడిపోయిన వారికి పార్టీ టిక్కెట్టు ఇవ్వబోదని చిన్నబాబు లోకేష్‌ ప్రకటించాడు. అదే పాలసీగా తీసుకుంటే సర్వేపల్లిలో చంద్రమోహన్‌రెడ్డికి టిక్కెట్టు వచ్చే అవకాశమే లేదు. తొలినుండీ పార్టీకి విధేయు లుగా వున్న వారి విషయంలో ఆ నిబంధన సడలి స్తారా లేదా కఠినంగా పాటిస్తారా..? అన్నది వేచి చూడాలి. ఒకవేళ ఖచ్చితంగా పాటిస్తే సర్వేపల్లిలో కాకాణిని ఢీ కొనగల సత్తావున్న టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి తప్ప ఇంకెవరున్నారు? అన్నది కూడా సందిగ్ధమే.
కందుకూరులో మహీధర్‌రెడ్డి
వైసీపీలోనే ఉంటారా?
కొత్తగా నెల్లూరుజిల్లాలో చేరిన కందుకూరు నియోజకవర్గంలో కూడా అయోమయం నెలకొని
ఉంది. మహీధర్‌రెడ్డిని పక్కనపెట్టి ఇక్కడ బీసీ కోటాలో వంకి పెంచలయ్య కుమార్తె కటారి అరవింద యాదవ్‌ని అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. ఆమె విజయానికి తనవంతు సహకరిస్తానని మహీధర్‌రెడ్డి పైకి ప్రకటించినా, లోలోపల రగిలి పోతున్నాడని ఆయన అనుయాయులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఆయన వైసీపీలో కొనసాగడం కష్టమే అంటున్నారు. వేమిరెడ్డి నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగితే మహీధర్‌రెడ్డి కూడా ఆయనతో జతకట్టే అవకాశాలు లేకపోలేదన్నది వారి అభిప్రాయం.
కావలి టీడీపీ అభ్యర్థిగా
కావ్య కృష్ణారెడ్డినే కొనసాగిస్తారా?
కావలి తెదేపా అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డికి ఆ పార్టీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కావలి నియోజకవర్గం పైన కూడా వేమిరెడ్డి ప్రభావం పడే అవకాశం
ఉంది. కావ్యతో వేమిరెడ్డికి మంచి సంబంధాలే
ఉన్నాయి కాబట్టి ఆయనని మార్చమని అడగకపోవచ్చని కావ్య కృష్ణారెడ్డి కోటరీ నుండి వస్తున్న సమాచారం. అయితే, ఇక్కడ నుండి వీపీఆర్‌ సతీమణి ప్రశాంతిరెడ్డిని రంగంలో దింపే ఆలోచన కూడా ఆ పార్టీ అధిష్టానం పరిశీలనలో ఉందంటున్నారు. ఒకే కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వబోమన్న సిద్ధాంతాన్ని కూడా టీడీపీ అవలంభించాలనుకుంటోంది. అయితే, చంద్రబాబు, లోకేష్‌, బాలకృష్ణ అంతా ఒకే కుటుంబం కాదా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది కాబట్టి, ఆ సిద్ధాంతాన్ని అటకెక్కిస్తారని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. కావలిలో కూడా చివరివరకు సస్పెన్స్‌ కొనసాగే అవకాశాలు ఎక్కువే.
ఉదయగిరి వైసీపీ, టీడీపీ
అభ్యర్థులుగా ఢీకొనబోయేదెవరు?
ఉదయగిరిలో కాకర్ల సురేష్‌, బొల్లినేని రామా రావులు టీడీపీ టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఇక్కడ కాకర్ల సురేష్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నాయి పార్టీ వర్గాలు. రామారావు 2019 తరువాత నియోజక వర్గాన్ని పూర్తిగా మర్చిపోయాడంటున్నారు అక్కడ స్థానికులు. కాకర్ల గత రెండేళ్లుగా ఉదయగిరి నియో జకవర్గాన్నే కనిపెట్టుకుని అక్కడ ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకున్నాడని అంటున్నారు. ఇక వైసీపీ తరపున ఆ పార్టీ బరిలో దింపాలనుకుంటున్న మేకపాటి రాజగోపాలరెడ్డి రాజకీయాలకి పూర్తిగా కొత్త. ప్రజలతో సంబంధాలు లేని వ్యక్తి. మేకపాటి అన్న ఇంటిపేరు తప్ప మరే ఇతర అర్హతా ఆయనకి లేవంటున్నారు ఉదయగిరి ప్రజలు. అభ్యర్థిని మారిస్తే తప్ప మా చూపు వైసీపీ వైపు ఉండదని ఖరాఖండిగా చెప్తున్నారని ఇటీవల అక్కడ సర్వేచేసిన ఒక సంస్థ ప్రతినిధి చెప్పిన సమాచారం. కాబట్టి, ఇక్కడా వైసీపీ పునరాలోచన చేయొచ్చు.
ఆదాల ప్రభాకరరెడ్డి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తారా?
వేమిరెడ్డి పార్టీని వీడిన క్రమంలో జిల్లా రాజకీయాలలో అనూహ్య మార్పులు సంతరించు కోనున్నాయన్నది రాజ కీయ విశ్లేషకుల అభి ప్రాయం. ఈ పరిస్థి తులలో ఆదాల ప్రభాకరరెడ్డి రూరల్‌ అభ్యర్ధిగానే పోటీ చేస్తారా? లేక పార్టీ పార్లమెంటుకి పోటీ చేయమంటే పునరాలోచనలో పడతారా?? అన్నది ప్రశ్నార్ధకం. ఆయన నామినేషన్‌ వేసే వరకు సందిగ్ధ పరిస్థితే ఉంటుందన్నది ఆ పార్టీ శ్రేణుల అభిప్రాయం. వీపీఆర్‌ టీడీపీ పార్లమెంటు అభ్యర్థి అయితే ఆయనని ఢీ కొనగలిగేది ఆదాల ఒక్కరే అంటున్నారు పార్టీ శ్రేణులు. కానీ, వీపీఆర్‌పై పోటీ చేయడానికి ఏపీఆర్‌ సుముఖత చూపిస్తారా లేదా? అన్నది భేతాళ ప్రశ్న!
ఇదీ, ప్రస్తుతం నెల్లూరుజిల్లాలో నెలకొనివున్న రాజకీయ వాతావరణం. ఖచ్చితంగా పాత నెల్లూరు జిల్లా.. ప్రకారం మొత్తం పదికి పది సీట్లలో వైసీపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ శ్రేణులు ఆశపడ్డ జిల్లా గందరగోళ పరిస్థితులలో పడిపోయింది. ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం నెల్లూరుజిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలున్నాయి. ఎనిమిదిలో వైసీపీ ఎన్ని గెలుస్తుందో? అన్న మీమాంస ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో స్పష్టంగా కనపడుతోంది.
ఓవైపు ఉత్కంఠ, మరోవైపు ఉత్సాహంతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలా జిల్లా రాజకీయం క్షణ.. క్షణం మారుతోంది!

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here