Home సినిమా వార్తలు అనంత లోకాలకు అఖండుడు

అనంత లోకాలకు అఖండుడు

నటనారంగంలో మేరునగధీరులైన ఒక్కొక్కరూ తిరిగిరాని తీరాలకు తరలిపోతున్నారు. తెలుగు ప్రజలు ఆరాధించిన పాతతరం మహానటులు ఒకరి తర్వాత ఒకరు మనల్ని వీడి వెళ్లిపోతున్నారు. ‘ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు,’.. అందరూ ఉద్దండులే. మహానటులే. ఆ వరుసలో సూపర్‌స్టార్‌ కృష్ణ కూడా చేరారు. ఆయన అస్తమయంతో తొలి తరం అగ్రశ్రేణి హీరోల శకం ముగిసిపోయినట్లేనని ప్రజలంతా ఆవేదన చెందుతున్నారు.
నవంబరు`15.. తెలుగు సినీపరిశ్రమలో మరో విషాద దినం. సూపర్‌స్టార్‌ కృష్ణ.. 15 వేకువన అనారోగ్యంతో అస్తమించారు. ఆకాశంలో ఎన్నో తారలున్నా.. అక్కడ కూడా తన ప్రత్యేకత చూపుతూ.. కృష్ణ ఒక ధృవతారగా.. ‘సూపర్‌స్టార్‌’గా నిలచిపోయారు. ఆయన మృతితో.. ఒక నటశిఖరం ఒరిగిపోయినట్ల యింది. తొలి తరం శకం ముగిసినట్లయింది. ప్రేక్షక లోకం కన్నీటిసంద్రమైంది. వెండితెరకు, అభిమానులకు తీరని శోకమే మిగిలింది.
దశాబ్దాల తరబడి తన విశేష నటనా చాతు ర్యంతో అశేష ప్రేక్షక జనావళిని ఉర్రూతలూ గించిన మహానటుడు.. నటశేఖరుడు..కృష్ణ 79 ఏళ్ళ వయసులో అనారోగ్యానికి గురై కన్ను మూయడంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మూగబోయింది. నటశేఖరునిగా, డేర్‌ అండ్‌ డ్యాషింగ్‌ హీరోగా.. సూపర్‌స్టార్‌గా ప్రఖ్యాతి గన్న కృష్ణ.. ఇక లేరన్న సమాచారం.. తెలుగు ప్రజలకు కంటనీరు తెప్పించింది. ఆయన అంత్యక్రియలు ఈనెల 16న హైదరాబాద్‌లో జరిగాయి. కృష్ణ తనయుడు.. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. తొలుత, ఆయన పార్ధివదేహాన్ని దర్శించుకున్న అభిమానులు, ప్రముఖులు ఆ సాహస నటునికి కడసారి కన్నీటి వీడ్కోలు తెలిపారు.
సాహసాలకు పెట్టింది పేరు
సాహసాలకు పెట్టింది పేరు.. అనుకున్నది సాధించేదాకా వదలని తీరు.. ఆయనే నటశేఖరుడు, తెలుగువారి జేమ్స్‌బాండ్‌.. సూపర్‌స్టార్‌ కృష్ణ. దాదాపు 340 సినిమాల్లో హీరోగా నటించి, చిత్రపరిశ్రమలో ఎవరూ చేయలేనన్ని సాహసాలు చేసి, తెలుగు సినిమారంగానికి అనేకరకాల సాంకేతికలను సమకూర్చిన అసాధ్యుడు.. అఖండుడు..‘కృష్ణ’. సాంఘికాలు, సాహసచిత్రాలు..చారిత్రిక చిత్రాల్లోనే కాదు.. కౌబాయ్‌, క్రైమ్‌.. వంటి చిత్రాలను కూడా సూపర్‌హిట్‌లు చేసి సూపర్‌స్టార్‌ అనిపించుకున్నారు. ఆయన ఎన్నో అవార్డులు సాధించారు. 1976లో ‘నటశేఖర’ బిరుదుతో ఘనసన్మానం జరిగింది. 2008లో ఆంధ్ర యూనివర్శిటీ ‘కళాప్రపూర్ణ డాక్టర్‌’ అవార్డునిచ్చి అభినందించింది. 2008లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించింది. 2009లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘పద్మభూషణ్‌’ పురస్కారాన్నిచ్చి గౌరవించింది.
తేనెమనసులతో సినీరంగ ప్రవేశం
కృష్ణ.. పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణ. గుంటూరుజిల్లా తెనాలి మండలం బుర్రిపాళెంలో 1942 మే 31న జన్మించారు. 1965లో ‘తేనెమనసులు’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి తెలుగు సినీరంగంలో సూపర్‌స్టార్‌గా అత్యంత ప్రజాదరణ పొందారు. ఆ తర్వాత 1966లో ‘గూఢచారి 116’ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం ఆయనకు ‘జేమ్స్‌బాండ్‌’గా పేరుతేవడమే కాక, సినీరంగంలో ఆయన సుస్థిరస్థానం సాధించేందుకు దోహదం చేసింది. ఈ చిత్ర విజయంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా సువర్ణావకాశాలు లభించాయంటే ఆ చిత్రం ఎంత జనాదరణ పొందిందో అర్ధమవు తుంది. ఆ తర్వాత అదే తరహాలో మరో 6 జేమ్స్‌బాండ్‌ చిత్రాల్లో నటిస్తే అవన్నీ కూడా విజయం సాధించడం విశేషం. అదేవిధంగా తొలి తెలుగు కౌబాయ్‌ సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’ మరో హిట్‌ కొట్టింది. క్రైమ్‌ చిత్రాల నటునిగా కూడా కృష్ణ మరో ప్రఖ్యాతిని సాధించారు. ‘పగ సాధిస్తా’ సినిమా సూపర్‌హిట్‌ కావడం, అనంతరం మరో 8 క్రైమ్‌చిత్రాల్లో హీరోగా ఆయనకు అవకాశం రావడం.. ఇలాంటివన్నీ కృష్ణ విలక్షణ నటనా వైభవానికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు.
వినూత్న ప్రయోగాలకు ఆద్యుడు
అసామాన్యమైన నటనా ప్రతిభ ఆయన సొంతం. దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించారు. 16 సినిమాలకు స్వయంగా దర్శకత్వం వహించారు. సినీ రంగంలో అనేక రకాల వినూత్న ప్రయోగాలకు ఆయనే ఆద్యుడు. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్‌ సినిమా ‘గూఢచారి 116’, తొలి కౌబాయ్‌ సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’, తొలి ఫుల్‌స్కోప్‌ సినిమా ‘అల్లూరి సీతారామరాజు’, తొలి 70ఎంఎం సినిమా ‘సింహాసనం’తో పాటు కృష్ణ సినీరంగంలో కొత్త కొత్త ప్రయోగాలకు నాందిపలికారు. ఏ సాహసప్రయోగం చేసినా దాదాపు అన్నీ విజయవంతంగానే చేశారు. ఎంతో కష్టతరమైన, విభిన్నమైన పాత్రలు పోషించారు. 1964 నుంచి 1995 దాకా సగటున పదేళ్ళకు వంద సినిమాల్లో నటించారు. ఏడాదికి 10 సినిమాల వంతున 300 సినిమాలు పూర్తిచేశారు. ఇందుకోసం మూడుషిఫ్ట్‌లలో అహరహం శ్రమించారు. తనదైన ప్రత్యేక బాణీతో ‘హిట్‌ చిత్రాల హీరో’గా పేరుగాంచారు. 1970లో సొంతంగా హైదరాబాద్‌లో పద్మాలయ స్టూడియో నిర్మించారు. కృష్ణ నటించిన, లేదా తీసిన సినిమాల్లోకెల్లా అత్యంత ప్రభావవంతమైన సినిమా ‘అల్లూరి సీతారామరాజు’. ఈ చిత్రం తెలుగునాట మార్మోగింది. ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. రికార్డు స్థాయిలో లక్షలాదిమంది అభిమానులు, వేలాది అభిమానసంఘాలు ఆయన సొంతం. నటశేఖరునిగానే కాక మంచి నాయకునిగా కూడా కృష్ణ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఏలూరు పార్లమెంట్‌ స్థానానికి పోటీచేసి విజయం సాధించి ఎంపీ అయ్యారు. వ్యక్తిగత జీవితంలో ఆయన అనేక ఒడిదుడుకులను చవిచూశారు. ఇరువురిని వివాహం చేసుకున్నారు. మొదటి భార్యపేరు ఇందిర. జీవితభాగస్వామిని విజయనిర్మల. వీరిరువురు కూడా కొంతకాలం క్రితం మరణించారు. కృష్ణ నటవారసునిగా ఇప్పుడు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు చిత్రసీమలో అద్వితీయంగా రాణిస్తూ తండ్రికి తగ్గ తనయునిగా ఉంటూ..తండ్రిపేరు నిలబెడుతున్నారు.
లాయర్ తో నటశేఖరుడి అనుబంధం
సగం దూరం కారులో వచ్చి, వాన కారణంగా వెనక్కి చెన్నై వెళ్ళి, రైల్లో నెల్లూరుకి వచ్చి తుంగా పండుగలో పాల్గొని ‘లాయర్‌’ వ్యవస్థాపకులు కీర్తిశేషులు తుంగా రాజగోపాలరెడ్డి స్మారక ‘తుంగా అవార్డు’ అందుకున్న మాటతప్పని మంచిమనిషి కృష్ణ.
సూపర్‌ స్టార్‌ కృష్ణతో ‘లాయర్‌’కి అపురూప ఆత్మీయ అనుబంధం ఉంది. 1998 నవంబర్‌ 8న జరిగిన తుంగా రాజగోపాలరెడ్డి 68వ జయంతి వేడుక ‘తుంగా పం డుగ’లో కృష్ణ పాల్గొన్నారు. ఆయన నెల్లూరుకు రావడం అదే చివరిసారి. ఆయనకు అత్యంత ఆప్తమిత్రులు, మన నెల్లూరీయులు, తుంగా కుటుంబానికి ఆత్మబంధువు డాక్టర్‌ సిఎంకెరెడ్డి – నిర్మల దంపతులు తోడురాగా కృష్ణ – విజయనిర్మల జంట నెల్లూరుకు వచ్చి తుంగా పండుగకు కళ తెచ్చారు. సుప్రసిద్ధ కవి, సినీ రచయిత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సంబరంలో తుంగా రాజగోపాలరెడ్డి స్మారక మూడవ ‘తుంగా అవార్డు’ను కృష్ణ అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ డాక్టర్‌ ముద్దుకృష్ణారెడ్డి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని, ఆయన ద్వారా ‘లాయర్‌’ సంపాదకులు ప్రభుతో ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. బ్రతికున్న అమ్మా, నాన్నలను వృద్ధాశ్రమాలలో చేర్పిస్తున్న రోజుల్లో దివంగతులైన నాన్న గుర్తుగా ఇలా ఆయన పుట్టినరోజుని జరపడం మంచి విషయమని ఆ సభలో మాట్లాడిన కృష్ణ, విజయనిర్మల ప్రశంసించారు.
కారులో బయలుదేరి, వెనక్కు వెళ్లి రైల్లో వచ్చారు
సినిమా వాళ్లంటే అహంకారానికి ప్రతిరూపాలు, గర్వం వాళ్ళకు అలంకారం. ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే వస్తామని చెప్తారు. చిన్న కారణం దొరికినా ఆ సాకు చెప్పి మానుకుంటారు. అలాంటి గుణాలు, అవలక్షణాలు భూతద్దం పెట్టి వెతికినా కృష్ణలో కనిపించవు. 1998లో జరిగిన లాయర్‌ ‘తుంగా పండుగ’ అందుకు పెద్ద ఉదాహరణ. నిజానికి నవంబర్‌ 8 సాయంత్రం పురమందిరంలో ఆ వేడుక జరగాలి. కార్యక్రమానికి ఒకరోజు ముందు నుండి అతి భారీ వర్షాలు చెన్నై , నెల్లూరు నగరాలను అతలాకుతలం చేసేశాయి. తుంగా పండుగలో పాల్గొనడానికి సిఎంకె రెడ్డి, కృష్ణ దంపతులు మద్రాసు నుండి కారులో బయలుదేరారు, దాదాపుగా సరిహద్దు సమీపానికి వచ్చారు. అక్కడే చిక్కొచ్చింది, భారీ వర్షాలతో వచ్చిన వరద కారణంగా గుమ్మడిపూడి సమీపంలో ఉన్న ‘కార్నోడై’ వద్ద బ్రిడ్జీ కూలిపోయింది. నెల్లూరు ` మద్రాసుల మధ్య రోడ్డు మార్గం బందైపోయింది. ఈ కారణం చాలు ఆయన కార్యక్రమానికి రాలేకపోతున్నానని చెప్పడానికి. కానీ, ‘మన కోసం వాళ్ళు ఏర్పాట్లు చేసుకుని
ఉంటారు, వెళ్ళకపొతే నిరుత్సాహపడతారు, రైల్లో వెళ్దాం’ అని సిఎంకె రెడ్డికి చెప్పి అప్పటికప్పుడు పినాకిని ఎక్సప్రెస్‌లో టిక్కెట్లు బుక్‌ చేయించుకుని సాయంత్రం 5 గంటలకల్లా నెల్లూరుకు చేరుకున్నారు. పురమందిరం నుండి వేదిక కస్తూరిబా కళాక్షేత్రానికి మారింది. సాయంత్రం 5 గంటలకల్లా ప్రాంగణం క్రిక్కిరిసిపోయింది. ఆనాటి ‘తుంగా పండుగ’ అంగరంగ వైభవంగా జరిగింది.
మాటతప్పని మంచి మనిషి, విలువలున్న మహామనీషి, తెరపై తప్ప నిజ జీవితంలో నటించడం తెలియని మానవీయ వ్యక్తి ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’ అని చెప్పడానికి మచ్చుకు ఈ ఒక్క సంఘటన చాలు.

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here