Home జిల్లా వార్తలు అథోగతిలో.. గ్రంథాలయాలు

అథోగతిలో.. గ్రంథాలయాలు

గ్రంథాలయాలు సరస్వతీ నిలయాలు. విజ్ఞాన బాండాగారాలు. పుస్తకాలు చదువుకోవడం ద్వారా ప్రజల్లో విజ్ఞాన సముపార్జనకు బాటలు వేసే గ్రంథాలయోద్యమం ఎందరో మహనీయుల కృషి ఫలితంగా ఆవిర్భవించింది. అయితే, అటు పాలకులు..ఇటు అధికారుల అనాసక్తి వల్ల జిల్లాలో గ్రంథాలయాల పరిస్థితి దయనీయంగా మారింది. గ్రంథాలయాలకు ఇవ్వాల్సిన సెస్సు బకాయిలు ఇవ్వకపోతుండడంతో వీటి అభివృద్ధి అడుగంటిపోయింది. కోట్లల్లో ఆ బకాయిలు పేరుకుపోతున్నాయి. మరో వైపు అనేక గ్రంథాలయాలు శిథిలావస్తకు చేరుకుంటున్నాయి. అయినా అధికారులకు చీమకుట్టినట్లు కూడా ఉండదు. ఒక్క నెల్లూరు కార్పొరేషన్‌ నుంచే దాదాపు 32 కోట్ల రూపాయల దాకా సెస్సు బకాయిలు రావాల్సివుందంటే అతిశయోక్తి కాదు. ఆ బకాయిలు ఇంకా ఎన్నేళ్ళకు వస్తాయో, ఈ గ్రంథాలయాలు ఎప్పటికి బాగుపడతాయో ఆ దేవుడికే తెలియాలి.
జిల్లాలో గ్రంథాలయాల వారోత్స వాలు మొన్ననే జరిగాయి. ఉత్సవాలు ఘనంగానే ఉన్నాయి కానీ, గ్రంథపాలకుల్లో మాత్రం ఉత్సాహం లేదు. కారణం ఒకటే..నిధులు లేవు. రావాల్సిన బకాయిలు రావు. ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టా లన్నా అవస్తగానే ఉంటోంది. జిల్లా గ్రంథా లయాలకు ఇది ప్రతిఏటా ఎడతెగని సమస్యగానే ఉంటోంది. గత ఏడాది కూడా ఇదే దుస్థితి.
గ్రంథాలయాల అభివృద్ధికి సెస్సులతో వచ్చే నిధులే కీలకం. గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల నుంచి కొంతమొత్తాన్ని గ్రంథాలయాలకు సెస్సుల రూపంలో చెల్లించాలనేది ప్రభుత్వ నిబంధన. 1961 ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ లైబ్రరీస్‌ యాక్ట్‌ ప్రకారం స్థానిక సంస్థలు ప్రజల నుంచి వసూలుచేస్తున్న పన్నుల్లో రూపాయికి 8 పైసల వంతున గ్రంథాల యాలకు సెస్సు రూపేణా చెల్లించాలి. దాంతో గ్రంథాలయాల అభివృద్ధికి బాటలు వేయాలి. ఎప్పుడు ప్రజలనుంచి పన్నులు వసూలు చేస్తారో, అదే రోజున గ్రంథాలయాలకు కూడా సెస్సులు పం పాలి. కానీ, జిల్లాలోని స్థానిక సంస్థల వారు ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ముక్కు పిండి పన్నులు వసూలు చేసుకుంటున్నారు కానీ, గ్రంథాలయాలకు ఇవ్వాల్సిన సెస్సు మాత్రం చెల్లించకపోవడం విడ్డూరం. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా, చివరికి పలు గ్రంథాలయాలు శిథిలమై నెత్తిన కూలేందుకు సిద్ధంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని లైబ్రరీల్లో కనీస వసతులు లేవు. కంప్యూటరీకరణ అసలే లేదు. పుస్తకాలు భద్రపరిచేందుకు సరైన బీరువాలు కూడా లేక చెదలు పట్టిపోతున్నాయి. ఎంతకాలం ఇలా?.. ఇకనైనా, ఏనెలకానెల సెస్సు బకాయిలు తప్పనిసరిగా చెల్లించేవిధంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని గ్రంథా లయాల బాగుకు చేయూతనివ్వాలి.
ఈ కంప్యూటర్‌ కాలంలో గ్రంథా లయాలకు వచ్చే పాఠకులే అంతంత మాత్రం. ఇక, వారికి కూడా కనీస సదు పాయాలు కల్పించలేకపోతే… గ్రంథా లయాలు వెలవెలపోక తప్పదు.
జిల్లా గ్రంథాలయానికే దిక్కు లేదు
జిల్లాలో 61 శాఖా గ్రంథాలయాలున్నాయి. గ్రంథాలయాల నిర్వహణకు, జీతభత్యాలకు సగం వ్యయాన్ని ప్రభుత్వం భరించినా, మిగిలిన సగాన్ని సెస్సు ద్వారా వచ్చే నిధులతోనే గ్రంథాలయ సంస్థ నడుస్తుంది. గ్రంథాలయాలకు వచ్చే పాఠకులకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా, మరమ్మతులకు గురైన గ్రంథాలయాల భవనాలను బాగుచేసుకోవాలన్నా, కొత్త భవనాలు నిర్మించుకోవాలన్నా..దేనికైనా సరే నిధులే ముఖ్యం. కానీ ఇచ్చేవారెవరు? గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో గ్రంథాలయాలకు అక్కడి ఉన్నతాధికారులు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క నెల్లూరు జిల్లాలోనే ఈ దుర్గతి. సెస్సు బకాయిలు సరిగా చెల్లించని జాబితాలో నెల్లూరుజిల్లా అగ్రస్థానంలో ఉండడం ఘోరం. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి కొత్త భవనం నిర్మించాలని, పాఠకులకు అన్ని సౌలభ్యాలు కలుగజేయాలని 2019లో నెల్లూరు నగరంలో శంకుస్థాపనైతే ఘనంగానే చేశారు కానీ, ఆ తర్వాత పనులే ప్రారంభం కాలేదు. భవన నిర్మాణానికి 2 కోట్ల రూపాయలవుతుందని అంచనా. దాన్ని ఇంకెన్ని ఏళ్ళకు నిర్మిస్తారో తెలియదు. జిల్లాకేంద్రంలోని భవనమే నిధులు లేక నిలచిపోయిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ప్రత్యేకించి చెప్పేదేముందీ?..ఇప్పటికే జిల్లాలోని పలు గ్రంథాలయాలు శిథిలావస్తకు చేరుకున్నాయి. అనుమసముద్రంపేట, ఇందుకూరుపేట, మనుబోలు, చెన్నారాయునిపాళెం, అల్లూరు, దగదర్తి, సైదాపురం, రాపూరు, కలువాయి, మర్రిపాడు ప్రాంతాల్లోని గ్రంథాలయాలు రేపోమాపో కూలిపోయేట్లున్నాయి. వానకు ఉరుస్తున్నాయి. పుస్తకాలు తడుస్తున్నాయి పైకప్పుల పెచ్చులు రాలిపోతున్నాయి. ఈ సరస్వతీ విలాపాన్ని ఎవరు పట్టించుకుంటారు?..
కోట్లల్లోకి చేరిన..
సెస్సు బకాయిలు:
జిల్లాలో గత మార్చి నెల నాటికి.. ఒక్క నెల్లూరు కార్పొరేషన్‌ నుంచే గ్రంథాలయాల సెస్సు బకాయిలు 32 కోట్లా 69 లక్షల రూపాయలకు పైగానే చేరినా, ఈ బకాయిలు పేరుకుపోతూ అంతకంతకూ పెరుగుతున్నా, ఎప్పటికప్పుడు పన్నులు వసూలుచేశాక ఇవ్వాల్సిన సెస్సు బకాయిలు మాత్రం దాదాపు అయిదేళ్ళు గడిచిపోతున్నా పట్టించుకునే నాథులు లేరు. అదేవిధంగా ఉభయనెల్లూరు జిల్లా పరిధిలోని గూడూరు మునిసిపాలిటీ నుంచి రూ. 97 లక్షలు, వెంకటగిరి నుంచి రూ. 45 లక్షలు, నాయుడుపేట నుంచి రూ. 21 లక్షలు బకాయిలు రావాల్సివుంది. సూళ్ళూరుపేట మునిసిపాలిటీ ఎంతో నయం సెస్సు బకాయిలు పెండిరగ్‌లో లేకుండా చెల్లిస్తోంది. కావలి మునిసిపాలిటీ నుంచి 44 లక్షల రూపాయలు, ఆత్మకూరు నుంచి రూ.63 లక్షలు, బుచ్చి నగర పంచాయతీ నుంచి రూ. 12 లక్షలు, అల్లూరు నగర పంచాయతీ నుంచి రూ. 73 వేలు, ఇవి కాకుండా జిల్లాలోని మొత్తం గ్రామపంచాయతీల నుంచి సుమారు 2 కోట్లకు పైగానే బకాయిలున్నాయి.
జిల్లా ఉన్నతాధికారులు, కార్పొరేషన్‌ ఉన్నతాధికారులైనా వెంటనే ఈ దుస్థితి గమనించి గ్రంథాలయాలకు బకాయిలు చెల్లించే ఏర్పాట్లు చేసి, తద్వారా వాటి అభివృద్ధికి అండగా నిలవాల్సి ఉంది.

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here